కర్నూలు జిల్లా అధికార వైసీపీకి అనుకూలమైన జిల్లా అనే విషయం తెలిసిందే. టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లోనే జిల్లాలోని 14 సీట్లలో 11 గెలుచుకుంది. టీడీపీ కేవలం మూడు సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీలో ఉన్న హేమాహేమీలు ఘోరంగా ఓడిపోయారు. జగన్ దెబ్బకు టీడీపీ నేతలు చాపచుట్టేశారు.

ఇక జగన్ వేవ్‌లో కర్నూలు టీడీపీలో బలమైన ఫ్యామిలీగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం కూడా దారుణంగా ఓడిపోయింది. ఎన్నికల్లో కేఈ పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు శ్యామ్‌కు పత్తికొండ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఊహించని విధంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన కంగాటి శ్రీదేవి 42 వేల మెజారిటీతో శ్యామ్‌పై విజయం సాధించారు. అయితే శ్రీదేవి భర్త నారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 31 వేల ఓట్లు సాధించి సత్తా చాటారు. తర్వాత ఆయన వైసీపీలోకి చేరి కేఈ కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. కానీ, ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దీంతో అనుహ్యాంగా ఆయన భార్య శ్రీదేవి తెరపైకి వచ్చారు. అప్పటి నుంచి కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ వచ్చిన శ్రీదేవికి 2019 ఎన్నికల్లో సానుభూతితో పాటు జగన్ గాలి కూడా కలిసి రావడంతో, సూపర్ విక్టరీ కొట్టింది.

ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీదేవి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అయితే శ్రీదేవి ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయం సొంత పార్టీలోనే ఉంది. పత్తికొండలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తాగునీరు, సాగునీరు సమస్యలతో పాటు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ కేఈ ఫ్యామిలీ అడ్రెస్ లేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ వీక్ అయిపోయింది. అలాగే అధికార వైసీపీ బలం పెరిగింది. ఈ దెబ్బతో కేఈ ఫ్యామిలీకి చెక్ పడినట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: