
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతో అద్భుతమైన సంగీతంతో ఎంతోమందిని ఆకట్టుకున్న రెహమాన్ మొట్టమొదటిసారిగా తెరపై మనకు కనిపించి తనలో ఉన్న నటుడ్ని మనకి పరిచయం చేయబోతున్నారు.
బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న 'ఆరాట్టు' చిత్రంలో నటిస్తున్నారు రెహమాన్. ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎ.ఆర్.రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఏ.ఆర్.రెహమాన్ సినిమా సెట్ లో భాగంగా దర్శకుడు, హీరో మోహన్ లాల్ తో కలిసి దిగినటువంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.."అరుదైన ఎప్పటికీ గుర్తుండిపోయే షూట్" ఇది అని రెహమాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాని హిప్పో ప్రైమ్ మోషన్ పిక్చర్స్, మూవీ పే మీడియాస్ ఆర్డీ ఇల్యుమినేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన తమిళ చిత్రం 'బిగిల్'లోని ఓ పాటలో కనిపించి సందడి చేసిన రెహమాన్ ఈ సినిమా ద్వారా మొదటిసారిగా అతిధిపాత్రలో సందడి చేయనున్నారు.