
ఈ ప్రాజెక్ట్‌కు పుణెలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజనీర్స్) నాయకత్వం వహిస్తోంది. ఇది DRDO ఆధ్వర్యంలో పనిచేసే ఒక కీలక ప్రయోగశాల. దట్టమైన అడవులు, యుద్ధ భూముల వంటి ప్రమాదకర వాతావరణంలో కూడా మనుషుల ఆదేశాల మేరకు క్లిష్టమైన పనులను ఈ హ్యూమనాయిడ్ రోబో చేయగలిగేలా డిజైన్ చేస్తున్నారు.
సెంటర్ ఫర్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ గ్రూప్ డైరెక్టర్ ఎస్. ఇ. టలోలే మాట్లాడుతూ, తమ టీమ్ గత నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు రోబో పై భాగం, కింది భాగం ప్రోటోటైప్‌లను వేర్వేరుగా అభివృద్ధి చేశామని, అంతర్గత పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
ఇటీవలే పుణెలో జరిగిన నేషనల్ వర్క్‌షాప్ ఆన్ అడ్వాన్స్‌డ్ లెగ్గ్డ్ రోబోటిక్స్‌లో ఈ రోబోను ప్రదర్శించారు. ప్రస్తుతం ఇది అభివృద్ధిలో కీలక దశలో ఉంది. ఇప్పుడు దీని ప్రధాన దృష్టి, మనుషులు ఇచ్చే ఆదేశాలను కచ్చితంగా అర్థం చేసుకుని, వాటిని పర్ఫెక్ట్‌గా అమలు చేసేలా దీని సామర్థ్యాన్ని మెరుగుపరచడంపైనే ఉంది.
ఈ వ్యవస్థ ప్రధానంగా మూడు ముఖ్యమైన భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి యాక్యుయేటర్లు (Actuators). ఇవి మనుషుల కండరాల మాదిరిగా పనిచేసి, రోబో కదలడానికి సహాయపడతాయి. రెండు సెన్సార్లు (Sensors). ఇవి చుట్టుపక్కల పరిసరాల నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తాయి. మూడు కంట్రోల్ సిస్టమ్స్. ఇవి సెన్సార్ల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించి, రోబో ఎలాంటి పనులు చేయాలో నిర్ణయిస్తాయి.
నిజ జీవిత పరిస్థితుల్లో రోబో బ్యాలెన్స్ కోల్పోకుండా నిలబడటం, వేగంగా, సాఫీగా స్పందిస్తూ పనులు చేయడం అనేది ఒక పెద్ద సవాల్. బ్యాలెన్స్ కంట్రోల్, వేగవంతమైన డేటా ప్రాసెసింగ్, నేల స్థాయిలో క్షేత్రస్థాయి పనులు చేయడం వంటివి ఇందులో కీలకం.
ఈ డిజైన్ టీమ్ లీడ్ సైంటిస్ట్ కిరణ్ అకెల్లా చెప్పిన దాని ప్రకారం, 2027 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా సిద్ధం చేయాలనేది తమ లక్ష్యం. ఈ హ్యూమనాయిడ్‌కు చాలా తేలికైన చేతులు ఉంటాయి. వీటి కీళ్ల వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. మొత్తం 24 డిగ్రీల స్వేచ్ఛ దీనికి ఉంటుంది. దీని వల్ల ప్రమాదకర ప్రాంతాల్లో కూడా తలుపులు తెరవడం, వస్తువులను తోయడం, లాగడం లేదా వాల్వ్‌లను తిప్పడం వంటి పనులను చేయగలదు. గనులు, పేలుడు పదార్థాలు, రసాయనాలు వంటి ప్రమాదకరమైన వాటిని నిర్వహించడానికి రెండు చేతులు కలిసి పనిచేస్తాయి.
ఇది చాలా ఆటోమేటెడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. పడిపోతే మళ్లీ లేవడం, ఏదైనా తోస్తే తట్టుకోవడం (push recovery), సొంతంగా దారి వెతుక్కుంటూ వెళ్లడం, ఉన్నచోట మ్యాప్‌ను తయారు చేసుకుంటూ వెళ్లడం, దారిని ప్లాన్ చేసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. లోపల, బయట, పగలు, రాత్రి తేడా లేకుండా ఇది పనిచేస్తుంది. ఇందుకోసం లోపలి, బయటి సెన్సార్లు, ఆడియో, వీడియో పరికరాల వంటివి ఉంటాయి.
ఇలాంటి రెండు కాళ్ల (bipedal), నాలుగు కాళ్ల (quadrupedal) రోబోలను కేవలం రక్షణ, భద్రతలో మాత్రమే కాకుండా.. ఆరోగ్యం, ఇంటి పనులు, అంతరిక్ష ప్రయోగాలు, తయారీ రంగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించవచ్చు. అయితే, పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన, అత్యంత సమర్థవంతమైన రోబోలను తయారు చేయడం ఇప్పటికీ పెద్ద సాంకేతిక సవాలే అని వారు అంగీకరిస్తున్నారు.