సినిమా ఓ రంగుల ప్రపంచం. అది ఒక్కోసారి ఊహించని సక్సెస్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్‌ను చేస్తుంది. అలాగే కలలో కూడా అనుకోని డిజాస్టర్‌ను ఇచ్చి పాతాళానికి తొక్కేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమంది స్టార్ హీరోలు కూడా చిక్కుకుని తమ కెరీర్లో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయారు. సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమా అట్టర్ ప్లాప్‌లుగా మారడంతో ఏం చేయాలో కూడా తెలియని డిప్రెషన్‌తో కొన్నాళ్ల పాటు కనుమరుగు కూడా అయిపోయిన సందర్భాలూ లేకపోలేదు. దీనికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అతీతుడు కాదు. ఎప్పుడో 70లలో సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఇప్పటివరకు 150కి పైగా సినిమాలు చేశారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లున్నాయి. అలాగే కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి.

చిరంజీవిని కన్నీళ్లు పెట్టించిన వేట:
చిరంజీవి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా వేట. ఎందుకంటే ఈ సినిమా మెగాస్టార్‌తో కన్నీళ్లు పెట్టించింది. 1986లో వచ్చిన ఈ సినిమాపై చిరంజీవి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. అలెగ్జాండ్రా డుమాస్ అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిరు అనుకున్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరిణామం చిరంజీవి ఊహించలేదు. భారీ హిట్ అవుతుందని అనుకున్న సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో చిరు కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించాడు. వేట డిజాస్టర్ తరువాత ఇంటికెళ్లి దుప్పటి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చానని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రెండేళ్లు ఇండస్ట్రీకి దూరం చేసిన సినిమా:
చిరు కెరీర్లో ఎన్ని ప్లాప్‌లున్నా ఆయనను ఇండస్ట్రీ నుంచే దాదాపు కనుమురుగు చేసిన సినిమా బిగ్ బాస్. 1995లో వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయిన తరువాత చిరంజీవి దాదాపు రెండేళ్ల పాటు ఇండస్ట్రీలో మళ్లీ కనిపించలేదు. ముఠా మేస్త్రీ, ఎస్పీ పరసురాం వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత బిగ్ బాస్ సినిమా చేశాడు మెగాస్టార్. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఆయన చాలా నమ్మకాలే పెట్టుకున్నాడు. కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మాడు. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన పెదరాయుడు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో మెగాస్టార్ దాదాపు 2 ఏళ్లు మళ్లీ సినిమా చేయలేదు. బిగ్ బాస్‌తో పాటే షూటింగ్ చేసిన రిక్షావోడు సినిమా తప్ప 97వరకు మరో సినిమా చేయలేదు. అయితే 97లో మళ్లీ తెరపైకొచ్చిన చిరంజీవి హిట్లర్‌తో మంచి హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: