ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, ర్యాపర్ యో యో హనీ సింగ్ పై అతని భార్య షాలిని తల్వార్ గృహ హింస కేసు పెట్టి వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ కేసు లో ఢిల్లీ టిస్ హజారీ కోర్టు హనీ సింగ్‌కు ఆస్తి విషయమై ప్రత్యేకంగా నోటీసు జారీ చేసింది. తన ఆస్తికి సంబంధించి ఎలాంటి అమ్మకాలూ చేపట్టొద్దని ఆదేశించింది కోర్టు. గత విచారణలో కోర్టు హనీ సింగ్‌ని నేరుగా లేదా అతని కంపెనీ ద్వారా ఏదైనా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం ద్వారా తన ఆస్తిని విక్రయించవద్దని నోటీసుల్లో తెలిపింది. శుక్రవారం కోర్టులో హాజరైన హనీ సింగ్ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాడు. దీనిలో అతను తన యూఏఈ ఆస్తిపై ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించనని, అంటే ఆ ఆస్తిని అమ్మను అని కోర్టుకు హామీ ఇచ్చాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో హనీ సింగ్ కు ఓ ఇల్లు ఉంది. దీనితో పాటుగా విదేశాల్లో ఉన్న తన కంపెనీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆస్తకి సంబంధించిన మరికొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని కోర్టు అతడిని కోరింది.

హనీ సింగ్ తరఫున ఈ కేసుపై పోరాడుతున్న సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ హనీ సింగ్‌పై గృహహింస ఆరోపణలో కోర్టులో విచారణ జరుగుతోందని, తన ఆస్తిని అమ్మడాన్ని ఈ విధంగా ఆపలేమని, హనీ సింగ్ వ్యాపారాన్ని నిషేధించలేమని కూడా వాదించారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్ ఆదేశాల మేరకు యుఎఇలో తన ఆస్తిని అమ్మబోనని, కంపెనీ పత్రాలను కూడా దాఖలు చేస్తానని హనీ సింగ్ తరఫు న్యాయవాది వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత విచారణలో హనీ సింగ్‌కు వ్యతిరేకంగా జారీ చేసిన నోటీసు రద్దు చేసింది కోర్టు. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ సెప్టెంబర్ 28 కి వాయిదా వేసింది కోర్టు. గతసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆరోగ్యం బాలేదన్న కారణంతో హనీ సింగ్ కోర్టుకు గైర్హాజరు అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: