ఏపీలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల కార‌ణంగా అస‌లు ఇక్క‌డ సినిమాలు ఇప్ప‌ట్లో రిలీజ్ అవుతాయా ?  లేదా  ? అన్న సందిగ్ధావ‌స్థ అయితే కొద్ది రోజులుగా న‌డుస్తోంది. క‌రోనా తొలి వేవ్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణ‌యాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంవ‌త్స‌రం పాటు థియేట‌ర్లు మూసి వేశారు. అప్పుడే చాలా వ‌ర‌కు థియేట‌ర్ వ్య‌వ‌స్థ కుప్ప కూలిపోయింది. ఇక ఈ మార్చిలో థియేట‌ర్లు తిరిగి ఓపెన్ చేశారు. ఉప్పెన తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాన్ వకీల్ సాబ్‌, ర‌వితేజ క్రాక్ సినిమాలు మాత్ర‌మే ఓ మోస్త‌రుగా ఆడాయి. అంత‌లోనే క‌రోనా సెకండ్ వేవ్ రావ‌డంతో మ‌ళ్లీ తిరిగి థియేట‌ర్లు మూసి వేశారు. అస‌లు ఇప్ప‌ట్లో జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారో ?  రారో ? అన్న అనుమానాలు ఉండ‌గానే ఏపీ ప్ర‌భుత్వం వ‌కీల్ సాబ్ సినిమా థియేట‌ర్ల‌లో న‌డుస్తుండగానే అనూహ్యంగా టిక్కెట్ల రేట్లు త‌గ్గిస్తూ జీవో జారీ చేసింది.

దీంతో చాలా మంది ఈ టిక్కెట్ రేట్ల‌తో థియేట‌ర్లు ర‌న్ చేయ‌లేమని మూసేసుకున్నారు. ఇక ఇప్ప‌ట‌కీ సెకండ్ షోల‌కు అనుమ‌తులు లేవు. ఈ టైంలో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను  క‌లిసి ఈ రోజు చ‌ర్చించ నున్నారు. దీనికి తోడు ప్ర‌భుత్వం టిక్కెట్ల‌ను ఆన్ లైన్లోనే అమ్మాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు  ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకంపై సచివాలయంలో 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ స‌మావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,థియేటర్ ఓనర్లు వ‌స్తున్నారు.

ఆన్ లైన్లో టిక్కెట్ల అమ్మే అంశంపై అభిప్రాయాలు.. సలహాలు తీసుకుంటారు. మంత్రి పేర్ని నాని, ఉన్నతాధికారుల ఆధ్వ‌ర్యంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైములో ట్రాన్సఫర్ చేస్తామని  ప్రభుత్వం చెపుతున్నా ఇండ‌స్ట్రీ వాళ్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఇందుకు ఒప్పు కోవ‌డం లేదు. ఏపీ ఎఫ్డీసీ ద్వారా ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ను నిర్వహించనున్నట్టు ప్ర‌భుత్వం చెపుతోంది. ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీ డిమాండ్లు విన‌క‌పోతే ఏపీలో ఇప్ప‌ట్లో సినిమాలు రిలీజ్ అవుతాయా ?  లేదా ? అన్న‌ది తెలియ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: