తెలంగాణలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ప్రతియేటా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. అది కూడా దసరా పండుగ సమయంలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న బండారు దత్తాత్రేయ.. ప్రస్తుతం హరియాణ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే  బండారు దత్తాత్రేయ రాజకీయ వారసురాలుగా ఆయన కూతురు విజయలక్ష్మి అరంగేట్రం చేయబోతున్నారన్న చర్చ బీజేపీలో జోరుగా జరుగుతోంది. దసరా తర్వాత దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ వేదికగా ఆయన కుమార్తె విజయలక్ష్మిని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని చర్చించుకుంటున్నారు. దత్తాత్రేయ గవర్నర్‌గా రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్నారు. దీంతో‌ ఆయన తరపున విజయలక్ష్మి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు‌.‌ గతంలో దత్తన్న స్వయంగా అలయ్ బలయ్ కార్యక్రమానిమి అందర్నీ ఆహ్వానించేవారు. గత రెండు మూడేళ్ళుగా ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి స్వయంగా అన్ని పార్టీల నాయకులను కలసి అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా  ఆహ్వాస్తున్నారు. దీంతో దత్తన్న  వారసురాలుగా విజయలక్ష్మి క్రియాశీల రాజకీయాల్లోకి రావటానికి రంగం సిద్ధమైందన్న చర్చ కమలం పార్టీలో జోరందుకుంది.

నిజానికి బీజేపీలో  వారసత్వ రాజకీయాలకు చోటు ఉండదన్న ప్రచారముంది. ఈ నేపథ్యంలో బండారు దత్తాత్రేయ కుమార్తె రాజకీయ ప్రవేశం విషయం కాషాయపార్టీలో చర్చకు దారితీసింది. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను బీజేపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తుంటారు. అయితే బండారు దత్తాత్రేయ క్రియాశీల రాజకీయాలకు దూరంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో హరియాణ గవర్నర్ కొనసాగుతున్నారు. ఇకపై దత్తాత్రేయ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో తన రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తె విజయలక్ష్మిని రాజకీయ రంగ ప్రవేశం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు దత్తాత్రేయ వారసురాలిగా విజయలక్ష్మి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానకి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి.. కేంద్రమంత్రిగా పనిచేశారు. దత్తాత్రేయ నాలుగుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. అయితే 2019 లోక్‌సభ దత్తన్న స్థానంలో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి హోదాలో ఉన్నారు. అయితే గతంలో కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఎంపీగా ఉండటంతో అంబర్ పేట్ నియోజకవర్గం ఖాళీగా ఉంది. దీంతో అంబర్ పేట్‌పై దత్తన్న వారసురాలు విజయలక్ష్మి దృష్టి సారించారని కమలనాథులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: