అధికారం శాశ్వతం చేసుకోడానికి జగన్, చేజారిపోయిన అధికారం తిరిగి పొందడానికి చంద్రబాబు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరులో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రజలకు ఏం ఉపయోగం అనేదే అసలు ప్రశ్న. కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచిపోయినా చెప్పుకోడానికి ఒక రాజధాని అంటూ లేదు. అమరావతి అభివృద్ధి మధ్యలో ఆగిపోయింది. కొత్త రాజధానులుగా చెబుతున్న విశాఖ, కర్నూలులో ఇంకా ఏదీ మొదలు కాలేదు. కనీసం పాలనా రాజధాని విశాఖలో అయినా దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. కారణం హైకోర్టు కేసులు అని చెబుతున్నారు కానీ.. ఒకవేళ కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఇప్పటికిప్పుడు విశాఖలో జరిగే కొత్త అభివృద్ధి ఏంటో తెలియదు.

అప్పుడంతా అమరావతి.. ఇప్పుడా ఊసేది..
అభివృద్ధినంతా అమరావతిలో కేంద్రీకృతం చేయాలని చూశారు చంద్రబాబు. ముందు తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టినా, శాశ్వత నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి ఊరించారు. కానీ ఐదేళ్ల కాలంలో ఏదీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అమరావతికి ఓకే అని చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెబుతూ విశాఖపట్నం, కర్నూలుకి కూడా రాజదాని హోదా కల్పిస్తున్నామని చెప్పి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.

2024నాటికి ఏం చెబుతారు..?
అటు అమరావతిలో అభివృద్ధి ఆగిపోయింది, ఇటు కొత్త రాజధానుల్లో అనుకున్నట్టుగా పనులు మొదలు కాలేదు. చివరికి 2024 ఎన్నికలనాటికి రాజధాని అంశం కూడా ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారుతుందని తెలుస్తోంది. టీడీపీ వేసిన కోర్టు కేసుల వల్లే మూడు రాజధానులు పెండింగ్ లో పడిపోయాయని వైసీపీ ఆరోపిస్తుంది. అమరావతి అభివృద్ధి వైసీపీ వల్లే ఆగిపోయిందని టీడీపీ అంటుంది. చివరికి ఈ ఆధిపత్యపోరులో బలైపోయేది మాత్రం సామాన్యులే. రాజధానిని అడ్డు పెట్టుకుని ఎవరిది పైచేయో తేల్చుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు రాజధాని అంశానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: