అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్.. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానులపై ప్రకటన చేయడం సంచలనం రేపింది. శాసన రాజధానిగా అమరావతి, విశాఖను పరిపాలనా, కర్నూలును న్యాయరాజధానులుగా చేస్తామని చెప్పారు. ఆ బిల్లును మండలిలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందలేదు. దీంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకురాగా.. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. మరోవైపు మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి వర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ తరహాలో పరిపాలన, అభివృద్ధి ఒకే చోట కాకుండా.. వికేంద్రీకరణ జరగాలనే మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఇంతకాలం చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ వాదనకు పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాలేమైనా.. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తూ ప్రకటన చేస్తుందో చూడాలి.

మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక కారణాలు ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి అమరావతి రైతులు కోర్టుల్లో దాదాపు 54పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఆగిపోయింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం తీవ్ర చర్చనీయాంశమైంది.

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. కొత్త రాజధాని బిల్లును సిద్ధం చేసింది. అయితే ఇందులో కూడా సంచలనాలు ఉంటాయని తెలుస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తారా.. లేక విశాఖపట్నంను పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటిస్తారా..? అనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు గానీ.. ముందు ముందు ఏం చేయబోతున్నారేది ఉత్కంఠగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: