తెలిసి చేశారో లేక తెలియక చేశారో.. ఉద్యోగులకు ఏమీ తెలియదని చేశారో కానీ.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ అయిన సొమ్ముని తిరిగి ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంది. దాదాపు 800కోట్ల రూపాయల వరకు ఇలా జీపీఎఫ్ ఖాతాలనుంచి విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగా సంఘాల నేతలు మండిపడుతున్నారు, ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

నిబంధనల ప్రకారం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో ఎవరైనా నిధులు జమ చేయొచ్చు. కానీ వాటిని విత్‌ డ్రా చేసుకునే అధికారం మాత్రం ఉద్యోగికే ఉంటుంది. ఉద్యోగుల అనుమతి లేకుండా ఇప్పుడు వారి జీపీఎఫ్ ఖాతాలనుంచి నిధులు మాయం అయ్యాయి. నిధులు జమ చేసిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిని విత్ డ్రా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కొంతమంది ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలకు సంబంధించిన అకౌంట్ విషయాల స్లిప్పులను ఏజీ కార్యాలయం ఇటీవల ఆన్‌ లైన్‌ లో ఉంచుంది. ఆ స్లిప్పులను డౌన్‌ లోడ్‌ చేసుకుంటున్న ఉద్యోగులు వాటిని చూసిన తర్వాత షాకవుతున్నారు. గతంలో ఇవ్వాల్సిన డీఏ బకాయిలను విడతల వారీగా జీపీఎఫ్ అకౌంట్ లో జమచేసినట్లుగా స్లిప్పుల్లో ఉంది. అయితే గత మార్చిలో ఆ మొత్తం ఒకేసారి వెనక్కి తీసేసుకున్నట్టుగా కనపడుతోంది.

ఉద్యోగుల సర్వీసు ఆధారంగా.. ఒక్కొకరి ఖాతా నుంచి దాదాపు 60 వేల రూపాయలనుంచి లక్షా 50వేల రూపాయల వరకు జమ అయినట్టు చూపిస్తోంది. కానీ ఆ తర్వాత మార్చిలో ఆ మొత్తం మళ్లీ విత్ డ్రా అయినట్టు స్లిప్పుల్లో కనపడుతోంది. మార్చిలో కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా అయినట్టు సెల్ ఫోన్ కి మెసేజ్ కూడా వచ్చిందని చెబుతున్నారు. అప్పట్లోనే దీనిపై ఆందోళన చెందారు ఉద్యోగులు. ఆర్థికశాఖకు ఫిర్యాదులు చేశారు. కానీ, జీపీఎఫ్‌ ఖాతాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇన్నాళ్లు ఆగారు. తాజాగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాల స్లిప్పులు వచ్చాయి. దీంతో ఉద్యోగులు తమ జీపీఎఫ్ ఖాతాలనుంచి డబ్బులు విత్ డ్రా అయినట్టు తెలుసుకున్నారు. ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: