వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్గస్తులై నేటికి సరిగ్గా పదేళ్లు.. సరిగ్గా 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ కన్నుమూశారు. అయితే ఆయన మరణవార్త రాష్ట్ర ప్రజానీకానికి తెలియడానికి ఆయన చనిపోయిన తర్వాత 24 గంటలుపైగా పట్టింది. సెప్టెంబర్ 1 ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరిన హెలికాప్టర్ ఆ తర్వాత కొద్దిగంటల్లోనే అదృశ్యమైంది. జాడలేకుండా పోయింది.


వెళ్లాల్సిన గమ్యం చేరలేదు.. ఏమైందో తెలియదు.. ఇలా ఎంతసేపు.. దాదాపు 27 గంటలపాటు.. ముఖ్యమంత్రి అసలు బతికున్నారో లేదో తెలియదు.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాయం కావడం.. ఆయనకు ఏమైందో తెలియకపోవడం.. అప్పట్లో సంచలనం సృష్టించాయి. మీడియా అంతా హోరెత్తింది.. చివరకు ఆయన ఆచూకీ కోసం దేశంలోనే అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ జరిగింది.


వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం భారతదేశంలోనే ఇంతవరకు ఎన్నడూ జరగనంత అతి పెద్ద ఆపరేషన్ కర్నూలు జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. దేశ చరిత్రలోనే ఆది అతిపెద్ద గాలింపుగా చెబుతారు. హెలికాప్టర్ ఆచూకీ కోసం అవసరమైన అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 3 గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో సుఖోయ్ యుద్ధవిమానంతో మరోసారి గాలింపు తీవ్రం చేశారు. గాలింపు చేపట్టిన కొద్ది గంటల్లొనే కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న వెలుగోడుకు సమీపంలో పావురాల గుట్టపై హెలికాప్టర్ శకలాలను గుర్తించింది. వెంటనే.. సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం చేరవేశారు.


ముఖ్యమంత్రి ఆచూకీ కోసం రేయింబవళ్లు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెతుకుతున్న వేలాది మంది అభిమానులకు ఆర్మీ హెలికాప్టర్ పైలట్ అందించిన చీటితో సమగ్రమైన సమాచారం అందింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఆర్మీ హెలికాప్టర్లో నుంచి ఒక పైలట్ ముఖ్యమంత్రి వైయస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఒక చీటిలో రాసి జనం మధ్యలోకి పడవేశారు. పైలట్ భూమి మీదకు పడవవేసిన చీటిలో కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు 90 డిగ్రీస్, 8 కి.మీ అనే అక్షరాలతో పాటు ఆర్మీ కోడ్‌కు సంబంధించిన పలు ఇంగ్లీషు అక్షరాలు, అంకెలు ఉన్నాయి.


ఆ చీటిని అందుకున్న పోలీస్ అధికారులు రుద్రకోడు వైపు కాలి నడకన బయలు దేరారు. ఆ చీటి ప్రజలకు అందిన 30 నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలి పోయిన ప్రాంతం వెలుగు చూసింది. సుఖోయ్ అందించిన సమాచారం మేరకు సంఘటన జరిగిన తీరును బట్టి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా మరో నలుగురు బయటపడే అవకాశాలు లేవని ఒక అంచనాకు వచ్చారు. మధ్యాహ్నం 12.30లకు ముఖ్యమంత్రి మృతిపై ఆర్థిక మంత్రి రోశయ్య అధికారిక ప్రకటన చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: