రాజకీయాల్లో తెలిసి కొన్ని జరుగుతాయి. తెలియక కొన్ని జరుగుతాయి. ఎదురుగా దెబ్బేసే వారి కంటే వెనకాతల నుంచి వెన్నుపోటు పొడిచేవారే ఎక్కువగా ఉంటారు. ఏపీ రాజకీయాల్లో జగన్ ఇపుడు మధ్యాహ్న మార్తాండుడు. జగన్ని నేరుగా చూడడం ఇపుడున్న పరిస్థితుల్లో  చాలా కష్టమే. అందువల్ల జగన్ అనే  బలమైన నేతను ఎదుర్కొనేందుకు చీకట్లో చేతులు చాలానే కలుస్తున్నట్లున్నాయి.


జగన్ మీద సీబీఐ పగపట్టి కేసులు పెట్టింది. ఇది 2011 నాటి మాట. నాడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నారు. ఈ ఇద్దరూ కలసి కేసులు పెట్టించారని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఇపుడు కేంద్రంలో అధికారం మారింది. అయినా జగన్ కధ అలాగే ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ప్రజారంజకంగా పాలన చేస్తే మరిన్నేళ్ళు ఆ సీట్లోనే అతుక్కుపోతారు. సినీనటుడు అన్న నందమూరి స్థాపించిన టీడీపీ గాలివాటం అనుకుంటేనే 40 ఏళ్ళు పాటు ఉనికిని చాటుకుంది. 


ఇపుడు జగన్ పెట్టిన వైసీపీని కూడా పెంచి పెరగనిస్తే ఆయన వయసు ద్రుష్ట్యా మరిన్ని దశాబ్దాల పాటు రాజ్యం చేస్తారు. ఈ కారణంతోనే జగన్ని బదనాం చేయాలని ప్రత్యర్ధులు అంతా చేతులు కలుపుతున్నట్లుగా ఉన్నారు. జగన్ ఏపీలో పాతుకుపోతే దించడం కష్టం. ఆయన మీద ఇప్పటికీ జనంలో తరగని అభిమానం ఉంది. దాన్ని దెబ్బతీయాలంటే ఆయన మీద ఉన్న కేసులనే ఆయుధంగా వాడుకోవాలి. కాంగ్రెస్ పెట్టించిన కేసులే ఇపుడు మరో పార్టీకి కూడా ఆధారమవుతున్నాయి.


జగన్ జైలుకు వెళ్తాడు అని  యనమల రామక్రిష్ణుడు నుంచి అంతా నిబ్బరంగా చెప్పేస్తున్నారు. కొత్తగా పుట్టుకువచ్చిన పవన్ పార్టీ అయితే జగన్ నేరస్తుడు అనేసింది. జగన్ ముఖ్యమంత్రిగా కోర్టుల చుట్టూ తిరుగుతూంటే, ఆయన ఇమేజ్ దెబ్బతింటుందని  ఏపీ సీఎం కుర్చీపై గురి పెట్టిన పార్టీల దురాలోచన. దూరాలోచన కూడా. అందుకే సీబీఐ తీర్పు ఇలా రావడంతోనే అలా పండుగ చేసుకుంటున్నారు. మరి దీని వెనక ఎవరున్నారు. మాస్టర్ మైండ్స్ ఏంటి అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. పైకి కనిపించే నవ్వులన్నీ నిజాలు కావు, దోస్తులు అనుకున్న వారు కూడా కత్తులు దూయ‌వచ్చు. మొత్తానికి ట్రయల్ కోర్టు జగన్ పిటిషన్ కొట్టేసింది. రేపు హైకోర్టు ఏమంటుందో, ముందు ముందు ఎన్ని చిత్రాలు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోనున్నాయో. ఏది ఏమైనా జగన్ రాజకీయంగా ఇపుడు బిగ్ ట్రబుల్ ని ఫేస్ చేస్తున్నాడనే అనుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: