జనసేన ఓ రాజకీయ పార్టీగా నిర్మాణం తీరుని ఈ ఘటన సోదహరణంగా తెలియచేస్తోంది. ఒక పార్టీ అంటే అందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యంలో పార్టీలు కూడా భాగం. అవి తమ సొంత పార్టీల్లో కూడా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే జనసేన విషయంలో అలా జరుగుతోందా,  ఆ పార్టీ ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి వారు ఏ రకంగా స్పందిస్తున్నారు, అధినాయకుడు వారిని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటున్నాడు.. ఇవన్నీ ప్రశ్నలు, వీటికి సమాధానం ఒక రాజీనామా.


అవును సీనియర్ నాయకుడుగా మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని చూసిన నేత ఆయన. ఆయనే పసుపులేటి బాలరాజు. గిరిజనుల్లో మంచి పట్టున్న నిజాయతీ కలిగిన నేత. ఆయన 1989లో తొలిసారిగా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009 ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి గెలిచి మంత్రిగా అయిదేళ్ళ పాటు కాంగ్రెస్ సర్కార్ లో పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ కి అధ్యక్షునిగా  బాధ్యతలు నెరిపారు. మరి ఇంతటి సీనియర్ విశాఖలో జనసేనలో  చేరారు. ఆయన పాడేరు నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.


అయితే బాలరాజుకు పార్టీలో ఇచ్చిన గౌరవం ఏంటి అన్నది ఇక్కడ చర్చ. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకే ఆయన జిల్లా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తే కొత్తగా వచ్చిన జనసేనకు నాయకత్వం వహించలేరా. కానీ ఆయన్ని కనీసం సంప్రదించకుండా జనసేన లాంగ్ మార్చ్ విశాఖలో నిర్వహిస్తోంది. అంతే కాదు, హైదరాబాద్ నుంచి దిగుమంతి నాయకులు విశాఖ వచ్చి ఇక్కడ ప్రొగ్రాం చూస్తారట. వారి ఎవరికీ విశాఖ ఎల్లలు తెలియవు. వారిని పెట్టుకుని లోకల్ గా ఉన్న గట్టి నాయకులను పక్కన పెట్టడం ద్వారా జనసేన రాజకీయంగా ఏం సాధిస్తుందన్నది ఇక్కడ ప్రశ్న.


తనకు పార్టీలో అవమానం జరిగిందని బాలరాజు నిన్న రాత్రి పార్టీకి రాజీనామా చేసి దానిని పవన్ కళ్యాణ్ కి పంపించారు. మరో వైపు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు కూడా ఏమీ లేవని, పార్టీ పోకడ కూడా బాలేదని ఆయన భావించే తప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఆయన్ని పవన్ కుడిభుజంగా ఉన్న నాదెండ్ల మనోహర్ బతిమాలేందుకు ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయిందని సమాచారం. మొత్తానికి విశాఖలో పార్టీని బలోపేతం చేసుకుందామని లాంగ్ మార్చ్ తలపెట్టి ఉన్న వారిని పోగొట్టుకోవడం జనసేనకే చెల్లిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: