ఆర్టీసీ స‌మ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న వివిధ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. డెడ్‌లైన్ పెట్టి మ‌రీ..కార్మికుల‌ను విధుల్లో చేరాల‌ని ఆదేశించ‌డం...రూట్ల‌ను ప్రైవేట్ ప‌రం చేయ‌డం వంటివి స‌మ్మెపై కేసీఆర్ వైఖ‌రిని స్ప‌ష్టం చేశాయని రాజ‌కీయ‌పార్టీలు అంటున్నాయి. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు తాజాగా స్పందిస్తూ...స్వార్థపూరిత వ్యక్తిగత లాభాల కోసం వాస్తవాలను తారుమారు చేయడంతో సీఎం కేసీఆర్ నిరంతరం విశ్వసనీయతను కోల్పోతున్నారని మండిప‌డ్డారు. 
మోటారు వాహన సవరణ చట్టం 2019లో రవాణా సంస్థల గురించి ప్రస్తావించలేదని కృష్ణ‌సాగ‌ర్ రావు తెలిపారు.

``సీఎం కేసీఆర్ ఆర్టీసీని అమ్మేయాలని నిర్ణయం తీసుకొని 2019 మోటారు వాహన చట్టంలో ఉంది అని మరొకరిపై నిందలు వేయడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలోని అన్ని ఆర్టీసీ కార్పొరేషన్లు అన్ని ఆర్టీసీ చట్టం 1950 పరిధిలోకి వస్తాయి. కార్పొరేషన్ నిర్వహణ‌ బాధ్యత, పరిపాలన వ్యవస్థ కొరకు ఆర్టీసీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నియమించాలని అవసరం ఉంది. వారి ద్వారా మాత్రమే ఆర్టీసీ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు.`` అని వెల్ల‌డించారు. 


1950 నాటి ఆర్టీసీ చట్టం నిబంధనల ప్రకారం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని రద్దు చేయలేదని బీజేపీ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ``ఆర్టీసీ బోర్డు మరియు ఉద్యోగుల తీర్మానం అనుమతి లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఏకపక్షంగా ప్రైవేటీకరించదు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు జోక్యం చేసుకొని నవంబర్ 7 న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల ఉత్తర్వులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపోయిస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 7 లోపు ఆర్టీసీ ఉద్యోగులు తమ పోరాటాన్ని విరమించుకోవాలని, భేషరతుగా తిరిగి ఉద్యోగాలలో చేరాలని బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారు. కోర్టు ఎక్కడ ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు ఇస్తుందని ఆందోళనతో సీఎం ఇలాంటి బెదిరింపు హెచ్చరికలు చేస్తున్నారు.`` అని వెల్ల‌డించారు.


తెలంగాణ ప్రజలు ఇలాంటి భేదిరింపులకు భయపడరని కృష్ణ‌సాగర్‌ రావు స్ప‌ష్టం చేశారు. ``తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఉంది. తెలంగాణ ప్రజలు మరోసారి తెలంగాణ సాధన స్ఫూర్తిని ప్రద‌ర్శిస్తారని బీజేపీ నమ్ముతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ జూదంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.`` అని హెచ్చ‌రించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: