క‌రోనాపై యుద్ధానికి అనేక సంస్థ‌లు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్నాయి. క‌రోనాపై పోరుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద‌పెద్ద సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు వేల‌కోట్ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించాయి. ఇదే దారిలో ట్విట‌ర్ సీఈవో జాక్ డోర్సీ కూడా భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఇందుకోసం రూ.7,500 కోట్ల(100 కోట్ల డాలర్లు)ను ఇవ్వనున్నట్లు ఆయ‌న తెలిపారు. తన ఆన్‌లైన్‌ ఆర్థిక సేవల సంస్థ ‘స్కేర్‌' నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ఆయ‌న‌ చెప్పారు.  క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచానికి సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. బాధితుల‌కు సహాయ కార్యక్రమాలు చేపట్టడానికిగాను ఈ డ‌బ్బుల‌ను తాను స్థాపించిన సేవా సంస్థ ‘స్టార్ట్‌ స్మాల్‌'కు తరలించనున్నట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. త‌న దారిలో మ‌రికొంద‌రు ముందుకు వ‌స్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో అంద‌రం ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. జీవితం చాలా చిన్నదని, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుందామ‌ని జాక్‌ డోర్సీ పిలుపునిచ్చారు. 

 

ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..కాగా జాక్‌ డోర్సీ ప్ర‌క‌టించిన ఆర్థిక‌ సాయం ఆయన సంపదలో ఏకంగా 28 శాతం ఉండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అంద‌రూ అభినందిస్తున్నారు. మాన‌వాళి మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు ఇంత‌టి పెద్ద‌మ‌న‌సు చాటుకోవ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని ప‌లువురు అంటున్నారు. డ‌బ్బుక‌న్నా.. మాన‌వాళిని కాపాడుకోవ‌డానికే ట్విట్ట‌ర్ సీఈవో ప్రాధాన్య‌మిచ్చార‌ని కొనియాడుతున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 15ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇక మృతుల సంఖ్య సుమారు 90వేల‌కు చేరువ‌లో ఉంది. అమెరికాలో మాత్రం ప‌రిస్థితులు మ‌రింత ద‌య‌నీయంగా మారుతున్నాయి. సుమారు నాలుగున్న‌ర‌ల‌క్ష‌ల‌మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు. మృతుల సంఖ్య కూడా ప‌దివేల‌కుపైగా ఉంది. అలాగే స్పెయిన్, ఇట‌లీ త‌దిత‌ర దేశాల్లోనూ క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: