తెలంగాణలోని హైదరాబాద్ నగరం వనస్థలిపురానికి చెందిన ఒక మహిళ కరోనా నిర్ధారణ కావడంతో తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్పించామని... ఆస్పత్రిలో చేరిన తన భర్త ఆచూకీ లభించడం లేదని సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు. గత నెలలో తన భర్తకు, కుటుంబం మొత్తానికి కరోనా నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు కోలుకుని ఇంటికి రాగా తన భర్త మాత్రం రాలేదని ఆమె పేర్కొన్నారు. 
 
గాంధీ ఆస్పత్రి వైద్యులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని... తన భర్త ఆచూకీ కనుక్కోవాలని కోరారు. గాంధీ ఆస్పత్రి రోగి అదృశ్యం గురించి రకరకాలుగా ప్రచారం జరగడంతో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మంత్రి మాట్లాడుతూ మొదట్లో కరోనాతో చనిపోయిన వారిని దహనం చేయడానికి కూడా భయపడ్డారని చెప్పారు. ఈశ్వరయ్య అనే వ్యక్తి ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని అన్నారు. 
 
ఆయన కుమారుడు మధుసూదన్ అదే రోజు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని... గత నెల ఒకటో తేదీనే మధుసూదన్ కూడా చనిపోయాడని చెప్పారు. పోలీసులకు మధుసూదన్ మృతికి సంబంధించిన సమాచారం ఇచ్చామని అన్నారు. మధుసూదన్ భార్యకు ఈ విషయం తెలిస్తే షాక్ గురవుతుందని భావించి ఆమెకు, కుటుంబసభ్యులకు మధుసూదన్ మృతి గురించి చెప్పలేదని మీడియాకు తెలిపారు. 
 
కుటుంబ సభ్యులు క్వారంటైన్ కేంద్రాలలో ఉండటంతో జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది మధుసూదన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టే పరిస్థితి లేదని...అప్పటికే ఒకరు మృతి చెందడంతో మరొకరి మృతి గురించి చెబితే తట్టుకోలేరని తాము భావించామని తెలిపారు. కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉండటం వల్ల మధుసూదన్ చనిపోయాడని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 27 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1661కు చేరింది. రాష్ట్రంలో కరోనా భారీన పడి ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: