2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాల్లో, 22 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించగా టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు, 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2019 ఎన్నికల ఫలితాల తరువాత కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరాలని ప్రయత్నించినా... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే మాత్రమే పార్టీలో చేర్చుకుంటానని జగన్ చెప్పడంతో వెనుకడుగు వేశారు. 
 
రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని 23 మంది టీడీపీ నుంచి గెలిచారు. వారిలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా మిగతా 20 మంది ఎమ్మెల్యేలలో ఏడు నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కాబోతున్నారని ప్రచారం జరిగింది. వీరిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల పేర్లు కూడా ఉండటం గమనార్హం. చంద్రబాబు సీరియస్ కావడంతో వారు ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారని తెలుస్తోంది. 
 
తాజాగా ఏలూరి సాంబశివరావు టీడీపీని వీడేది లేదని తేల్చిచెప్పారు. టీడీపీని వీడతానంటూ జరిగిన ప్రచారాన్ని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే తాను పార్టీని వీడతానని దుష్ప్రచారం చేశారని చెప్పారు. కానీ టీడీపీలోని కొందరు నేతలు మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ పార్టీలోకి తీసుకోకపోయినా టీడీపీని వీడిన ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తున్నారు. 
 
వైసీపీలోకి వెళ్లినా ప్రభుత్వం వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉండటంతో తమకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. టీడీపీ సానుభూతిపరులు కూడా వైసీపీ నుంచి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. టీడీపీని వీడితే కార్యకర్తల నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నేతల్లో కొందరు అటు టీడీపీలో ఉండలేక... ఇటు వైసీపీలో చేరలేక మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: