బీహార్‌లో తొలివిడత పోలింగ్‌కు మరో వారం రోజులే ఉంది. దీంతో పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. మళ్లీ ఎన్డీఏకే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత అవసరమైతే.. ఎల్ జీపీ మద్దతు తీసుకుంటామని తేజస్వీ యాదవ్‌ చెప్పడం కలకలం రేపుతోంది.

బీహార్‌లో జేడియూ-బీజేపీ సారథ్యంలో ఎన్డీయే 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. 243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారధ్యం వహిస్తోన్న లోక్‌ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం లభించవచ్చని, ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీయేకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

బీహార్‌ ఎన్నికల్లో జేడీయూ కన్నా తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌ చెబుతున్నారు.  అంతిమంగా బీజేపీ - ఎల్జేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందంటూ ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత అవసరమైతే చిరాగ్ పాశ్వాన్‌ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ ఊహాగానాలను ఎల్‌జేపీ తోసిపుచ్చింది.

మరోవైపు బీహార్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలోనూ అభ్యర్థులు వినూత్నత ప్రదర్శిస్తున్నారు. దర్భంగా జిల్లాలోని బహదుర్‌పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్‌ అనే వ్యక్తి.. దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి బీహార్ లో ఎన్నికల వేడి కొనసాగుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: