ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి కొన్నేళ్లుగా మరీ దారుణంగా తయారైంది. గతంలో ఓ పది స్థానాల వరకూ గెలుచుకోగలిగిన ఈ పార్టీ గత రెండు ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యాయి. ఇక మొన్నటి ఎన్నికల్లోనైతే ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు ఖాతాలు కూడా తెరవలేదు. కమ్యూనిస్టులు ప్రజాసమస్యల గురించి పోరాటం మాని.. మిగిలిన పార్టీల తరహాలోనే రాజకీయాలు చేయడం అందుకు ఓ కారణం కావచ్చు.


ప్రస్తుతం కమ్యూనిస్టులు ఏదో ఒక పార్టీ అండలేనిదే.. అస్తిత్వం నిలుపుకోలేని దుస్థితి దాపురించింది. విచిత్రం ఏంటంటే.. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించిన ఇదే ఎర్ర పార్టీలు ఇప్పుడు అదే చంద్రబాబుకు తోక పార్టీలుగా మారిపోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల కోసం భూపోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది కానీ.. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే దాన్ని టీడీపీ అడ్డుకుంటుంటే వారేమీ మాట్లాడటం లేదు.


ఇప్పుడు ఇదే అంశంపై మంత్రి బొత్స కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు. పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలివ్వడం చంద్రబాబుకు ఇష్టం లేద‌ని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలివ్వడం క‌మ్యూనిస్టు పార్టీల‌కు కూడా ఇష్టం లేదా అని ప్రశ్నించారు. క‌మ్యూనిస్టు పార్టీలు టీడీపీని ఎందుకు ప్రశ్నించ‌డం లేద‌ని బొత్స స‌త్య నారాయ‌ణ నిల‌దీశారు. ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమ‌రావ‌తి ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాల‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ప్రశ్నించారు.


ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు క‌నీసం క‌ర‌క‌ట్ట రోడ్డు కూడా వేయ‌లేక‌పోయార‌ని బొత్స ఆరోపించారు. ఐదేళ్లలో ఐదు శాతం ప‌నులు కూడా చేయ‌లేక‌పోయార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు బాధంతా త‌న బినామీల కోస‌మే అన్నారు. చంద్రబాబు ఏపీలో ఉంటూ హైద‌రాబాద్‌లో ఇల్లు క‌ట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. పంచ‌భూతాల‌ను దోచుకుని ఏదో జ‌రిగిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని మంత్రి బొత్స  దుయ్యబ‌ట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: