విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు, భవానీలు పోటెత్తుతున్నారు. తెల్లవారు జాము నుంచే కొండపై భారీ క్యూ ఉంది. కొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారి రాజ రాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు బారులు తీరారు. దీంతో ఉదయం 5 గంటల నుండే అమ్మవారి దర్శనానికి అధికారులు అనుమతిచ్చారు.

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లకు చేరారు. జగన్మాతకు ప్రీతిపాత్రమైన దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్ చేసుకున్న 10వేల మంది భక్తులతో పాటు అంతకు రెండింతల మంది టికెట్‌లు తీసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చారు.

అక్టోబర్ 17 శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో (ఆదివారం) ముగియనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. నేడు దసరా కావడంతో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా... అందుకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు, భవానీలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నారు. మాస్క్ తప్పని సరి చేశారు.


కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలి. ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: