గ్రేటర్ వార్ లో కేటీఆర్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. బీజేపీపై ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. ఆపార్టీ పరువుని నిలువునా భాగ్యనగర వీధుల్లో పెడుతున్నారని అర్థమవుతుంది. కరోనా వ్యాక్సినా ఫ్రీ అంటూ గ్రేటర్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీకి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. వ్యాక్సిన్ కి కూడా బీజేపీ ఫీజు అడుగుతుందేమోనని ఎద్దేవా చేశారు.

తమకు ఓటు వేస్తే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇస్తామంటూ బీజేపీ చేసిన హామీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘కరోనా సమయంలో వలస కార్మికుల నుంచి రైల్వే చార్జీలు వసూలు చేసిన ఘనత బీజేపీదే.. రేపు ఎన్నికల తర్వాత వ్యాక్సిన్‌ కోసం ప్రజల నుంచి ఫీజు వసూలు చేసే పార్టీ కూడా బీజేపీయే. ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలన్నీ డొల్ల.. ఆ పార్టీ, తాజాగా నగరానికి మరో ప్యాకేజీ అంటూ హైదరాబాద్‌ ప్రజల చెవుల్లో కమలం పువ్వులు పెడుతోంది. ఇప్పటికే ప్రతి రూ.15 లక్షలు.. రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ అంటూ ప్రజల్ని దగా చేసిన బీజేపీ.. మరోసారి హైదరాబాద్‌ ప్రజలను వంచించేందుకు కొత్త నాటకం ఆడుతోంది. బీజేపీ మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని, అసత్యాలను, ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలు గమనించాలి’ అని కేటీఆర్ ఓ రేంజ్ లో బీజేపీని ఆటాడేసుకున్నారు.

హైదరాబాద్ లో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలను బీజేపీ వాడుకుంటోందని, ఆ ఫొటోలతో ప్రచార చిత్రాలు తయారు చేసుకునే స్థితికి దిగజారిందని సెటైర్లు వేశారు కేటీఆర్. ఇప్పటికే తమ ప్రభుత్వం పూర్తి చేసిన మెట్రోరైల్‌ ప్రాజెక్టు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, టాయిలెట్ల నిర్మాణం, మహిళా పోలీస్‌ స్టేషన్ ఫొటోల్ని కూడా బీజేపీ కాపీ కొట్టిందని అన్నారు కేటీఆర్. ఎన్నికల ప్రణాళికే సొంతంగా రాయలేని బీజేపీ.. రేపు నగర అభివృద్ధి ప్రణాళికలను కనీసం ఆలోచన చేయగలుగుతుందా అని ప్రశ్నించారు. ప్రతి ఆలోచన మాది కాపీ కొట్టి.. మీది.. మోదీ అంటే ఎలా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: