వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రఘురామ కృష్ణం రాజుని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆయనను హింసిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. ఇక నిన్న సాయంత్రం నుంచి రఘురామ విషయంలో స్పష్టత రావడం లేదు. ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి హడావుడిగా గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ నేపధ్యంలో హైకోర్ట్ వెంటనే రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయినా సరే ఇంకా రఘురామను గుంటూరు జిల్లా జైలులోనే ఉంచుతున్నారు అని ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కాస్త దూకుడుగా స్పందిస్తుంది. రఘురామను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసారు. కోర్టు ఆదేశాలకు లోబడి రఘురామకృష్ణంరాజును వెంటనే రమేష్ ఆసుపత్రికి తరలించండి అని ఆయన డిమాండ్ చేసారు.

సిఐడి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను జైలుకు తరలించడం దుర్మార్గం అని ఈ సందర్భంగా ఆరోపించారు. కోర్టులంటే లెక్కలేనివిధంగా సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. రఘురామ భార్య రమాదేవి కూడా తన భర్త ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు అని అన్నారు. గతంలో రఘురామ కూడా డిల్లీ హైకోర్టులో తనకు ఎపి ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని చెప్పి వై కేటగిరి భద్రత పొందారు అని లేఖలో వివరించారు. ఆయన ప్రాణాలకు ఏరకమైన హాని జరిగినా ముఖ్యమంత్రిగా మీదే బాధ్యత అని జగన్ పై విమర్శలు చేసారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే కక్షసాధింపు చర్యలకు దిగడం అన్యాయం అని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అమలుచేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: