వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌... మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ట్విట‌ర్ వేదిక‌గా కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె రోజుకో ట్వీట్ చేస్తుండటమే అందుకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే వ‌ర‌కు త‌న విమ‌ర్శ‌నాస్త్రాలు ఆగ‌వని ఆమె ప్ర‌క‌టించారు. అయితే ఈ ట్వీట్ల వివాదం సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం కేటీఆర్ సైన్యం వ‌ర్సెస్ ష‌ర్మిల సేన అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరువర్గాల మధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.

ఇటీవల మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించిన కేటీఆర్... ష‌ర్మిల పార్టీపై కీల‌క వాఖ్య‌లు చేశారు. ఈ సీజ‌న్‌లో అంద‌రూ వ్ర‌తాలు, పూజ‌లు చేసిన‌ట్లుగా.. ష‌ర్మిల కూడా పార్టీ పెట్టుకున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఇందుకు వైఎస్ ష‌ర్మిల కూడా త‌న‌దైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఏర్పాటు త‌ర్వాత తొలి ప్రెస్ మీట్ పెట్టిన ష‌ర్మిల‌... "కేటీఆర్‌ ఎవరు? ఓ కేసీఆర్‌ కొడుకా.." అని కామెంట్‌ చేశారు. ఆడవాళ్లు వ్రతాలకే పనికివస్తారంటూ కేటీఆర్‌ చెప్పడాన్ని బట్టే.. ఆయనకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో నేటికీ చర్చ జరుగుతూనే ఉంది.

ఇక కేటీఆర్‌ బర్త్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు అని విష్ చేస్తూనే.. నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు ఆపే హృద‌యాన్ని ఇవ్వాల‌ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ల‌క్షా 91వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే ప‌ట్టుద‌ల‌ను, 54 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించే చిత్తశుద్ధిని, ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చే మ‌న‌సు రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై టీఆర్ఎస్ శ్రేణులు ష‌ర్మిల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌గా... వైఎస్‌ ష‌ర్మిల సైతం టీఆర్ఎస్‌ లక్ష్యంగా రీట్వీట్లు చేశారు. ఈ పరిస్థితి రెండు పార్టీల నేతల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీసింది.

ఇక ఆదివారం కూడా కేటీఆర్‌ను విమర్శిస్తూ షర్మిల మరో ట్వీట్‌ చేశారు. కేటీఆర్ సేన వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో మాలో పోరాట స్పూర్తిని మ‌రింత పెంచార‌ని, మా క‌న్నా... మేము ఎంచుకున్న పోరాటం గొప్ప‌దంటూ ష‌ర్మిల త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంత గింజుకున్నా ఉద్యోగాలు ఇచ్చే వ‌ర‌కు పోరాటం సాగుతూనే ఉంటుంద‌ని, అప్ప‌టివ‌ర‌కు నిద్ర‌లేపుతూనే ఉంటామంటూ ట్వీట్‌ చేశారు. ఇలా షర్మిల వరుస ట్వీట్‌లు కేటీఆర్‌ను టార్గెట్‌ చేసినట్లుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: