ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాభవం చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ నానా పాట్లు పడుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా... దానిని వినియోగించుకుని... రాజకీయ లబ్ది పొందేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడో జూన్ 30న జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకువచ్చి... ప్రజల నోళ్లల్లో నానేందుకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయనే చెప్పాలి. రాయలసీమ జిల్లాల్లో కొద్దొగొప్పో ఉన్న తమ ఓటు బ్యాంకును మరింత పెంచుకునేందుకు... తీవ్రంగా కృషి చేస్తోంది కమలం పార్టీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ రోజు తెల్లవారుజాము నుంచి బీజేపీ నేతలు చేసిన హంగామా... ఆ పార్టీకి కొంత మైలేజ్ గానే ఉపయోగపడిందనే చెప్పాలి.

ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని గత నెల 30న మునిసిపాలిటి కౌన్సిల్ తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు కోసం వెంటనే భూమి పూజ కూడా చేశారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దీనిని వ్యతిరేకిస్తూ... ఈ రోజు కాషాయ పార్టీ నేతలు ప్రొద్దుటూరులో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ముందుగా మునిసిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఏకగ్రీవ నిర్ణయాన్ని కౌన్సిల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా పాల్గొన్నారు. అక్కడి నుంచి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశానికి ర్యాలీగా బయలుదేరారు కమలం పార్టీ నేతలు. అయితే ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవన్న పోలీసులు... బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును అదుపులోకి తీసుకుని నేరుగా కడప ఎయిర్ పోర్టుకు పోలీసులు తరలించారు.  అటు మిగిలిన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే రాచమల్లు తనదైన శైలిలో స్పందించారు. అసలు విగ్రహమే ఏర్పాటు చేయకముందే ఎందుకీ గొడవ అని ప్రశ్నించారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాచమల్లు ఆరోపించారు. ఏది ఏమైనా.. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కమలం పార్టీ నేతలు హంగామా చేస్తున్నారనేది ఎమ్మెల్యే వర్గం ఆరోపణలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP