ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు అమలు చేసి... కొత్త నిర్వచనం ఇచ్చేందుకు ఏపీ సర్కార్ వినూత్న మార్పులు చేస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో ఎన్ఈపీ 2020 అమలు ప్రణాళికపై విద్యా శాఖ అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సురేష్. నూతన జాతీయ విద్యా విధానంపై విద్యా శాఖాధికారులందరికీ స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఎక్కువగా సాంకేతికను ఉపయోగించాలని సూచించారు మంత్రి.

పిల్లల్లో 6 సంవత్సరాల వయసు వచ్చే సరికి 90 శాతం మానసిక ఎదుగుదల ఉంటుందని...  అప్పటి నుంచే విద్యాభ్యాసం, వినూత్న ఆలోచనల వైపు అడుగులు పడాలన్నారు. అందుకే పునాది విద్యా, పూర్వ ప్రాధమిక విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే అంగన్ వాడీలను అభివృద్ధి చేసిన సర్కార్.. నాడు-నేడు కింద అన్ని పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. విద్యార్థుల్లో పరిశోధనల దిశగా అడుగులు పడాలన్నారు మంత్రి సురేష్. ఉపాధ్యాయుల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త రకాల పాఠశాలలు పరిచయం చేసే సందర్భంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. పిల్లలు ఇబ్బంది పడతారనే అపోహను కూడా అధికారులే నివృతి చేయాలన్నారు. పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధికి నాడు - నేడు కింద మొదటి దశకు ఇప్పటికే 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఆగస్టు 16 నుంచి రెండో దశ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అక్షరాల 16 వేల కోట్ల రూపాయలతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించే విషయంలో ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ, అన్ని అవసరాలను తీరుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు వారి పదోన్నతుల ఫై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సురేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: