స్పందన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దంటూ సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుండా పోయింది. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందన కార్యక్రమానికి హాజరు కాలేదు కదా... పైగా కుంటి సాకులు కూడా. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ అధికారుల తీరుపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే వర్సస్ ఛైర్మన్ గా సాగుతున్న ఆధిపత్య పోరు ప్రస్తుతం ఉద్యోగుల మెడకు చుట్టుకునేలా ఉంది. ఓ వైపు పట్టణ తొలి పౌరుడు... మరోవైపు నియోజకవర్గం ఎమ్మెల్యే... వీరిద్దరి మధ్యలో ఉద్యోగులు నలిగిపోతున్నారు.

ప్రతి సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమానికి తాడిపత్రి మునిసిపాలిటీలో అన్ని ఏర్పాట్లు చేశారు. వినతి పత్రాలు, ఫిర్యాదులు అందించేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వింతతువులు సరే సరి. అలాగే మునిసిపల్ ఛైర్ పర్సన్ కూడా సమయాని కంటే ఓ గడియ ముందే వచ్చారు. కానీ తీరా చూస్తే... అధికారి కాదు కదా... చివరికి ప్యూన్ కూడా అక్కడ లేరు. చివరి వరకు రాలేదు కూడా. సాక్ష్యాత్తు పట్టణ ప్రధమ పౌరుడు, ఛైర్మన్ స్వయంగా ఫోన్ చేసినప్పటికీ స్పందన కార్యక్రమంలో అధికారుల స్పందన లేకుండా పోయింది. అదేమంటే... వాళ్లు చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎమ్మెల్యే గారు రమ్మన్నారు సార్.. అందుకే వెళ్లాం. ఆయనతో పాటే ఉన్నాం. వుయ్ ఆర్ ఆన్ డ్యూటీ సార్... అంటూ ఆన్సర్ ఇస్తున్నారు.

రూల్స్ ప్రకారం చూసుకుంటే... మునిసిపాలిటి పరిధిలో ఛైర్మన్ మాటకే విలువ ఎక్కువ. అధికారులు కూడా పట్టణ ప్రధమ పౌరుడి మాటకే కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యే పరిధి కూడా కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు వేయడం... సమావేశాల్లో పాల్గొనడం, ప్రజా సమస్యలపై నిలదీయడం మాత్రమే. ఆ మాటకు వస్తే... ఎమ్మెల్యేను కౌన్సిల్ హాల్ నుంచి సస్పెండ్ చేసే అధికారం కూడా ఛైర్మన్ కు ఉంటుంది. కానీ తాడిపత్రిలో మాత్రం సీన్ రివర్స్. అధికారులంతా ఎమ్మెల్యే మాటే వింటున్నారు. అదేమంటే... మాకేం తెలుసు సార్... ఎమ్మెల్యే సార్ రమ్మన్నారు... మేము వెళ్లాం... అంటున్నారు. ఇప్పుడు అధికారులందరికీ ఛైర్మన్ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఏం చేయాలో పాలుపోక నానా పాట్లు పడుతున్నారు. ఎమ్మెల్యే వర్సస్ ఛైర్మన్ ఆధిపత్య పోరులో... ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే... అడకత్తెరలో పోకచెక్కలా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: