ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్షంలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒకే గూటి పక్షులని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎప్పుటినుంచో చెబుతూ, విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించేలా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన మరోసారి టీడీపీకి సపోర్టుగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన రిపబ్లిక్‌ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు చేస్తే.. తెలుగుదేశం పార్టీకి ఆయన జై కొట్టినట్టే అన్న చర్చ జోరందుకుంది. ముఖ్యంగా "టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడిన వాళ్లు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలి" అని డిమాండ్‌ చేస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసైనికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్న సమస్యలు, లేవనెత్తిన అంశాలపైనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా గళమెత్తారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నేరస్థులు ఎవరనేది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసు అని, అయినా వారిని ఎందుకు చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం లేదని ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నిస్తూ వస్తోంది. అంతకుముందు కోడి కత్తితో దాడి వెనుక భారీ కుట్ర దాగుందని కూడా తెలుగుదేశం ఆరోపించింది. కోడి కత్తితో దాడితో పాటు వివేకా హత్య కేసు అంశాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో లేవనెత్తడంతో.. టీడీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే జగన్‌ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలో నెట్టివేసిందనీ, రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇదే అంశాన్ని పవన్‌ కల్యాణ్‌ కూడా నొక్కి వక్కాణించారు. ఆన్‌లైన్‌ టిక్కెట్ల విధానానికి, అప్పులకు ముడిపెడుతూ జగన్‌ సర్కారుని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. ఇక ఇడుపుల పాయ, పోడు భూములతో పాటు ముఖ్యంగా కాపు రిజర్వేషన్‌లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు.. జగన్‌ సర్కారుని ఎంతవరకు ఇరుకున పెడతాయో ఏమో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులను మాత్రం చాలా సంతోష పెట్టాయన్న చర్చ జరుగుతోంది. మొత్తంమీద పవన్‌ కల్యాణ్‌ తాజా వ్యాఖ్యలతో.. తెలుగుదేశం పార్టీకి జై కొట్టారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: