ఏపీలో టీడీపీ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌.. పార్టీ నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఉమ్మ‌డి స‌భ‌ల పేరుతో చంద్ర‌బాబు జిల్లాలపై పెద్ద ఎత్తున ఫోక‌స్ పెంచారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి స‌భ‌ల‌కు భారీ స్పంద‌న ల‌భించింద‌నే ఫీడ్ బ్యాక్ అందు తోంది. అయితే.. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే. అస‌లు ప్ర‌చారం 18వ తేదీ నుంచి ముందుకు సాగ‌నుం ది. దీనికి సంబంధించి పార్టీ అస్త్ర శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంది.


ఇక‌, 18వ తేదీన నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభం అవుతూనే.. పార్టీ ప్ర‌చారాన్ని హోరెత్తించే ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగా నారా, నంద‌మూరి కుటుంబాలు రంగంలోకి దిగ‌నున్నాయి. ఇప్ప‌టికే నారా చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు ప్ర‌చారం చేస్తుండగా.. నారా భువ‌నేశ్వ‌రి.. నిజం గెల‌వాలి యాత్ర‌ను శ‌నివారంతో పూర్తి చేశారు. ఆమె సోమ‌వారం నుంచి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఇక‌, నారా వారి కోడ‌లు బ్రాహ్మ‌ణి ఈ నెల 18 నుంచి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. మంగ‌ళ‌గిరిలోనే తిష్ఠ‌వేయ‌నున్నారు.


మ‌రోవైపు..హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు శ‌నివార‌మే శ్రీకారం చుట్టారు. స్వ‌ర్ణాంద్ర సాకార యాత్ర‌ను ఆయ‌న ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి పార్టీల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం చేస్తారు. మ‌రోవైపు.. బాల‌య్య స‌తీమ‌ణి నంద‌మూరి వ‌సుంధ‌ర‌.. హిందూపురంలో ఈ నెల 18 నుంచి ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇలా.. ఈ రెండు కుటుంబాలు రంగంలోకి దిగుతున్నాయి. అయితే.. క‌థ ఇక్క‌డితో అయిపోలేదు.


టీడీపీ ప్ర‌చారానికి ప్ర‌వాసాంధ్రులు క్యూ క‌డుతున్నారు. ఎన్నారై టీడీపీ నాయకులు వెయ్యి మంది ఈ నెల 18 నుంచి ఎన్నిక‌ల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేయ‌నున్నారు. వీరికి తోడుగా.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూ రు, చెన్నైల‌లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న‌వారిలో టీడీపీ సానుభూతిప‌రులు కూడా.. ప్ర‌చారానికి పోటెత్త‌నున్నారు. వీరు 500 మంది వ‌ర‌కు రావొచ్చ‌ని లెక్క‌తేలింది. వీరికి సంబంధించి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా.. మొత్తంగా టీడీపీ ప్ర‌చారం వ‌చ్చే 20 రోజుల్లో జోరు కాదు.. హోరెత్త‌నుంద‌ని అంటున్నారు నాయ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: