ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా అదో పెద్ద పద్మవ్యూహం. ఎందులో దూరితే ఎక్కడ బయటకొస్తామో.. ఎక్కడ వేలు పెడితే ఎలా ఇరుక్కుపోతామో మనకే తెలియదు. బయటకు కనిపించేది మంచిగానే ఉన్నా.. లోపల మాత్రం ఎన్నో చీకటి కోణాలు దీని సొంతం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జేబులు ఖాళీ కావడంతో పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆన్‌లైన్‌లో ఫేక్ మెసేజ్‌లు, పోస్టులతో వల వేసి అమాయకులను బుట్టలో వేసుకుని వారి నుంచి వేలకు వేలు వసూలు చేసి ఎంచక్కా బకరాలను చేసే ముఠాలున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఈ దందా ఫేస్‌బుక్‌కు మాత్రమే పరిమితం. కానీ ఇప్పడు ఇన్‌స్టాగ్రాంకు కూడా పాకింది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బయటకొచ్చింది.  

అందమైన అమ్మాయి ఫోటోలతో మైమరపించి.. చిన్నాగా స్నేహం చేసి.. తీపికబుర్లు చెబుతారు. ఆ మైకంలో మనం ఉండగానే.. ఆ తరువాత నెమ్మదిగా తానో సమస్యలో ఉన్నానని, కాలేజ్ ఫీజ్ కట్టాలని, అందుకు కొంత డబ్బు కావాలని చిన్న మొత్తం సొమ్మును కోరుతూ ప్రాథేయపడతారు. ప్రూఫ్ కోసం తమ కాలేజీ ఐడీ కార్డు కూడా పంపించి, పక్కన వారి లెక్చరర్స్‌తో కూడా మాట్లాడిస్తారు. మనం ఇచ్చేందుకు ఇష్టపడలేదనుకోండి.. అవసరమైతే ఓ రాత్రి గడుపేందుకు కూడా ఓకే అంటూ షాకిస్తారు. ఆ మెసేజ్ చూడగానే టెంప్ట్ అయితే అంతే సంగతులు. అడుగుతోంది చిన్న మొత్తమే కదా.. అందులోనూ అమ్మాయి కదా.. అని ఇచ్చామో.. వాళ్ల ప్లాన్ సక్సెస్.. మనం బకరా.

ఇలాంటి ఓ చాటింగ్ తాజాగా బయటకొచ్చింది.. అందులో..
అమ్మాయి: హాయ్
అబ్బాయి: హాయ్(అమ్మాయి ఫోటో బాగుంది కదా అని)
అమ్మాయి: నేను హైదరాబాద్‌లోని ... కాలేజిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
అబ్బాయి: ‘హౌఆర్ యూ’
అమ్మాయి: చదువుతున్నావా..? జాబ్ చేస్తున్నావా..?
అబ్బాయి: జాబ్ చేస్తున్నా
అమ్మాయి: ‘మనం ఫ్రెండ్స్ అవుదాం
అబ్బాయి: తప్పుకుండా. ఎక్కడ ఉంటావ్. నీ నిక్ నేం ఏంటి..?
అమ్మాయి: నీ ప్రొఫైల్ పిక్ బాగుంది(బిస్కట్)
అబ్బాయి: థాంక్యూ(ఆనందంతో..)
అమ్మాయి: ఒక చిన్న హెల్ప్ కావాలి. చేస్తావా..?(ఇక్కడ అసలు ట్విస్ట్)
అబ్బాయి: నువ్వు ఎక్కడ ఉంటావ్..?
అమ్మాయి: ఈ రోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్. నీ కాళ్లు పట్టుకుంటా అర్జెంట్ అమౌంట్.(దీనికి తోడు తన ఐడీ కార్డ్ కూడా పంపింది)
అబ్బాయి: నీ ఫోన్ నెంబర్ ఇవ్వు
అమ్మాయి: నీ నెంబరే నాకు ఇవ్వు
అబ్బాయి: నీ నెంబర్ ఇవ్వు కాల్ చేస్తా..
అమ్మాయి: కాదు నీ నెంబర్ ఇవ్వు
అబ్బాయి: ఎక్కడ ఉంటావ్..?
అమ్మాయి: కాలేజ్ హాస్టల్
అబ్బాయి: ఓకే

నంబర్ ఇచ్చిన అబ్బాయికి వెంటనే ఓ కాల్ వచ్చింది. ఫోన్‌లో అవతలి నుంచి అమ్మాయి వాయిస్ ‘హాయ్. ఈ రోజు కాలేజీలో ఎగ్జామ్ ఫీజ్‌కు లాస్ట్ డేట్. కేవలం రూ.2,500 కావాలి. ఇంక 20 నిముషాలే టైం ఉంది. ఆ తరువాత క్లోజ్ చేసేస్తారు. అది దాటితే కట్టలేను. సాయంత్రానికల్లా నాకు రూ.45 వేలు స్కాలర్‌షిప్ వస్తుంది. నమ్మకం లేకపోతే మా లెక్చరర్‌తో కూడా మాట్లాడు’ అని పక్క వ్యక్తికి ఫోన్ ఇచ్చింది. ఆ వ్యక్తి కూడా అవుననే చెప్పి.. కుదిరితే సాయం చేయమని అన్నాడు. ఇంతలో మళ్లీ అమ్మాయి ఫోన్ తీసుకుని ‘స్కాలర్‌షిప్ రాగానే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ ఎంతో దీనంగా చెప్పింది. ఇక చివరికి డబ్బులు పంపి ఈ ఒక్క అవసరం తీర్చితే మీతో గడుపుతానని కూడా మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూడగానే ఇవతలి అబ్బాయి షాకయ్యాడు. అయితే అతడు తెలివైన వాడు కావడంతో డబ్బులు పంపించకుండా సైలెంట్ అయిపోయాడు.

అయితే కొందరు నిజమే అనుకుని ఆలోచించకుండా డబ్బు పంపిస్తారు. అలా పంపితే వాళ్ల ప్లాన్ సక్సెస్ అయినట్లే. ఇక ఆ నెంబర్ పనిచేయదు. డబ్బులు పోయినట్లే. ఇలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: