రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అయితే.. అనేక ఉక్రెయిన్ నగరాలను రష్యా భస్మీపటలం చేసింది. ఇంకా రష్యా దాడులు ఆగడం లేదు. అయితే.. నాటో దేశాల సహకారంతో రష్యా దాడులను కాస్త తిప్పికొడుతోంది ఉక్రెయిన్.. అయితే.. ఇప్పుడు అలాంటి ఉక్రెయిన్‌కు కొత్త కష్టం కలరా రూపంలో వచ్చేసింది. రష్యా దాడుల కారణంగా పేరుకుపోయిన చెత్త, కుళ్లిన శవాలు, కలుషిత నీరు కారణంగా ఇప్పుడు ఉక్రెయిన్‌లో కలరా వ్యాపిస్తోంది.


అపరిశుభ్ర వాతావరణం కారణంగా ముసురుతున్న కీటకాలు వల్ల ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలను అంటు వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. రష్యా బాంబులతో అట్టుడుకిపోయిన మరియుపోల్‌, ఖేర్సన్‌ తదితర నగరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. వీటి కారణంగా  అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. కుళ్లిన శవాలు, కలుషిత నీరు కలరా వ్యాధి ప్రబలేందుకు కారణంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక ఉక్రెయిన్ నగరాల్లో పలు కలరా కేసులను గుర్తించారు.


ప్రత్యేకించి రష్యా దాడులతో కునారిల్లుతున్న మరియుపోల్‌ లో అనేక కలరా కేసులను గుర్తించినట్టు ఆ నగర గవర్నర్‌ చెబుతున్నారు. కుళ్లుతున్న శవాలు, ముసురుతున్న ఈగలు, బొద్దింకల వల్ల కలరా మరింత వ్యాప్తించవచ్చని ఉక్రెయిన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ముందు ముందు ఈ కలరా మరింత తీవ్రరూపం దాల్చ వచ్చని బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రష్యా దాడుల్లో అనేక మంది మరణించారు.


ఒకసారి కలరా ప్రబలిందంటే.. మృతుల సంఖ్య కూడా వేలల్లోనే ఉండే అవకాశం ఉంది. నెల రోజులుగా కలరాతో పాటు పలు అంటువ్యాధులను కూడా గుర్తించామని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.  ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామంటున్న అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు నెలల యుద్ధం కారణంగా ఏప్రిల్‌ నాటికే మరియుపోల్‌లో 10వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: