గతంలో తెలుగుదేశంలో పనిచేయడం వలన అనుకుంటా ఓ ఏపీ మంత్రికి ఆ పార్టీ మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీపై విమర్శలు చేసినట్లు చేస్తూనే పరోక్షంగా కొన్ని సలహాలు ఇస్తున్నారు. అయితే ఆ సలహాలు టీడీపీ వాళ్ళకు విమర్శలుగా కనిపించినా, అవి మాత్రం కరెక్ట్‌గా అర్ధం చేసుకుంటే మంచి సలహాలుగా కనిపిస్తున్నాయి.  అలా పరోక్షంగా టీడీపీకి మంచి సలహాలు ఇస్తున్న మంత్రి ఎవరో కాదో, విశాఖపట్నంకు చెందిన అవంతి శ్రీనివాస్.

 

2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం నుంచి గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, అందులో పనిచేసి, నెక్స్ట్ 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి, ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ ఐదేళ్లు టీడీపీలో పనిచేసిన అవంతి, తర్వాత మాత్రం చంద్రబాబు షాక్ ఇచ్చేసి, వైసీపీలోకి వచ్చేశారు. వైసీపీలోకి రావడమే 2019 ఎన్నికల్లో మళ్ళీ భీమిలి టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచేశారు.

 

ఇక విశాఖలో ఎంతమంది సీనియర్ నేతలు ఉన్నా సరే జగన్..మంత్రి పదవి మాత్రం అవంతికే ఇచ్చారు. పదవి వచ్చిన దగ్గర నుంచి అవంతి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ముందుకెళుతున్నారు. అయితే ఈయన అప్పుడప్పుడు టీడీపీ మీద విమర్శలు చేస్తూనే, పరోక్షంగా కొన్ని సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కూడా అలాగే కొన్ని వ్యాఖ్యలు చేశారు.

 

క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందని, ఓటమికి లోకేష్ కారణం కాదా..? అని ప్రశ్నించారు. అలాగే ఆయన బంధుప్రీతి, కుల రాజకీయాలు కారణం కాదా? అని నిలదీశారు. అసలు లోకేష్ వల్లే టీడీపీకి నష్టమని, ఆయన నాయకత్వంలో నడుస్తామని విశాఖ జిల్లాలోని ఒక ఎమ్మెల్యే తో చెప్పించగలరా..? అంటూ ఫైర్ అయ్యారు. లోకేష్ వెనుక భజన బ్యాచ్ ఉందని, రాజకీయం అనేది వారసత్వం నుండి కాదు ప్రజల్లో నుంచి రావాలని చెప్పారు.

 

నిజానికి అవంతి అడిగిన ప్రశ్నలు కరెక్ట్‌గానే ఉన్నాయి. లోకేష్ వల్లే పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగిందనేది టీడీపీ కార్యకర్తల మనసులోనే ఉంది. అలాగే భజన బ్యాచ్ పార్టీని నాశనం చేశారన్న సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబుని చూసి, టీడీపీ కేడర్ సైలెంట్‌గా ఉంటుంది. ఇప్పటికైనా అవంతి అడిగిన ప్రశ్నలపై ఆత్మపరిశీలన చేసుకుంటే టీడీపీ కాస్త బాగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని బట్టి చూసుకుంటే అవంతికి టీడీపీ మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: