కారు కొనుక్కోవాలనే కల అందరికీ ఉంటుంది. కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది. కనీసం సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలన్నా ఓ లక్ష రూపాయలు ఉండాలి. మరీ పాత దైనా పర్వాలేదు.. ఏదో ఒకటి కావాలనుకుంటే రూ. 50వేలైనా ఉండాలి కదా. కానీ.. అందులో సగానికంటే తక్కువ ధరకే అంటే.. రూ.16 వేలకే కారు తయారు చేశాడు ఓ కేరళ కుర్రాడు. ఇప్పుడు ఆ కారు అందరినీ ఆకట్టుకుంటోంది.


కేరళకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ఇర్ఫాన్‌ పాత స్కూటీ చక్రాలు, కారు సీట్లు, బైక్‌ ఇంజిన్‌ను ఉపయోగించి ఓ కారును తయారు చేశాడు. ఇదుకు తనకు కేవలం 16 వేల రూపాయలు ఖర్చుఅయిందంటున్నాడు. ఈ కారు గంటకు 55 కిలోమీటర్లు వేగంతో నడుస్తుందట. ముందు ముందు ఎలక్ట్రిక్‌ కారును తయారు చేస్తానంటున్నాడు.


ఇర్ఫాన్‌కు చిన్నప్పటి నుంచి వాహనాలంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా సొంతంగా ఓ కారును తయారు చేయాలన్నది అతని టార్గెట్. అందుకే ముందు పాత కార్లతో తన ప్రయోగాలు ప్రారంభించాడు. 16 వేల రూపాయలు ఖర్చు పెట్టి పాత స్కూటీ టైర్లు, కారు సీట్లు స్టీరింగ్‌,  బైక్‌ ఇంజిన్‌ను కొన్నాడు. వాటితో కుస్తీ పట్టి మొత్తానికి ఓ కారు తయారు చేశాడు. ఈ కారు చేసేందుకు ఇర్ఫాన్‌కు 20 రోజుల సమయం పట్టిందట. ఇది పెట్రోల్‌తో నడుస్తుంది.


ముందు ముందు ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తానంటున్నాడు ఇర్ఫాన్. సొంతంగా తయారు చేసుకున్న కారులో ఇప్పుడు ఇర్ఫాన్‌ ఊరంతా షికార్లు కొడుతున్నాడు. దర్జాగా సొంత కారులో ఫ్రెండ్స్‌ను ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్నాడు. ఈ కారు ఏదో వింతగా ఉంది కదా అని చుట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని చూసేందుకు వస్తున్నారట. ఇలా కాదు.. అలా చేయి అంటూ కొందరు సూచనలు కూడా ఇస్తున్నారట. మొత్తానికి 17 ఏళ్ల వయస్సులోనే కారు రూపొందించిన అనుభవం సంపాదించాడు ఇర్ఫాన్‌. అలా ఇంట్రస్ట్ పెట్టి పని చేస్తే ఏపనైనా సులభంగానే అవుతుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: