2019 ఎన్నికల్లో చిన్న వయసులో ఎమ్మెల్యేలుగా గెలిచిన అతి తక్కువ మందిలో వైసీపీ యంగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఒకరు. 30 ఏళ్ల జక్కంపూడి తొలిసారి పోటీ చేయడమే భారీ మెజారిటీతో టీడీపీ సీనియర్ నేత పెందుర్తి వెంకటేష్ ని మట్టికరిపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుంచి అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెందుర్తిపై దాదాపు 31 వేలపైనే గెలిచి సత్తా చాటారు. ఇక రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి అందరికి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా పనిచేసారు. 1989 , 1999 , 2004 లలో తూర్పుగోదావరి కడియం(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి గెలిచారు.

 

ఇక వైఎస్సార్ కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసారు. అయితే వైఎస్సార్ మరణంతో 2010 లో వైసీపీలో చేరిన జక్కంపూడి...అనారోగ్య సమస్యలతో 2011 లో మరణించారు. రామ్మోహన్ మరణంతో 2014 ఎన్నికల్లో రాజానగరం సీటుని ఆయన భార్య విజయలక్ష్మికి కేటాయించగా, ఆమె టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలొచ్చేసరికి రాజానగరం సీటు నుంచి రాజా పోటీ చేసి విజయం సాధించారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజా, తనదైన శైలిలో పని చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఎమ్మెల్యే కాకమునుపు రాజా కొంచెం దూకుడుగా ఉండేవారు. ఆ దూకుడు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. అయితే ఎమ్మెల్యే అయ్యాకా, అందరిని కలుపుకుని వెళుతున్నారు. దూకుడు తగ్గించుకుని, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. పార్టీల పరంగా కాకుండా, అందరికి న్యాయం చేస్తున్నారు. ప్రత్యర్థి టీడీపీ ఓటర్లు, కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. వారికి ఎలాంటి కష్టమున్న అండగా నిలబడుతున్నారు.

 

పైగా అటు టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్ వైఖరితో విసుగెత్తిపోయిన టీడీపీ కార్యకర్తలు రాజా చెంతకు వచ్చేస్తున్నారు. ఆఖరికి కమ్మ సామాజికవర్గ కార్యకర్తలు సైతం రాజాకు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ మీడియా సైతం రాజా చేసే పనులకు మద్దతుగా ఉంటుంది. అయితే రాజా అందరిని కలుపుకుని మంచి నాయకుడుగా ఎదగాలని చూస్తుంటే, తన కుటుంబం చేసే కొన్ని పనుల వల్ల రాజాకు కాస్త ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నారు.

 

ఇక పనులు పరంగా చూసుకుంటే, నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు ఏమి జరగలేదు. అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయింది కాబట్టి, అనుకున్న మేర పనులు అవ్వలేదు. అలాగే ప్రభుత్వ పథకాలు విషయంలో రాజాకు ఫుల్ మార్క్స్ ఇవ్వొచ్చు. పార్టీల పరంగా చూడకుండా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.   

 

దీంతో లాక్ డౌన్ వల్ల పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తున్నారు. తండ్రి రామ్మోహన్ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పేదలకు భోజనం అందిస్తున్నారు. ఇక కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా కాపులకు లోన్లు ఇస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లైతే రాజా శత్రువులని సైతం మెప్పించేలా పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: