విజయనగరం జిల్లా పేరు చెబితే...ఠక్కున గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ బొత్స ఫ్యామిలీదే హవా. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు వైసీపీలో ఉన్నా సరే బొత్స ఫ్యామిలీకి తిరుగులేదు. మొన్న ఎన్నికల్లో కూడా వీరు ఫ్యామిలీకి చెందిన వారు మంచి విజయాలు అందుకున్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతి నగరం నుంచి బొత్స సోదరుడు బొత్స అప్పలనరసయ్య, బొత్సకు అత్యంత సన్నిహితుడైన అలమంగి జోగారావు పార్వతీపురం నియోజకవర్గం నుంచి గెలిచారు.

 

ఇక నెలిమర్ల నుంచి బొత్స సమీప బంధువు బద్దుకొండ అప్పలనాయుడు టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిపై సూపర్ విక్టరీ కొట్టారు. ఈయన 2009లో కాంగ్రెస్ నుంచి అదే స్థానం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో బొత్స కాంగ్రెస్ లో ఉన్నాసరే అప్పలనాయుడు మాత్రం వైసీపీలోకి వచ్చి నెల్లిమర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

అయితే ఓటమి పాలైన సరే నియోజకవర్గంలోనే పని చేసుకుంటూ, ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. అందువల్ల 2019 ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ దక్కించుకుని, రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో సాధ్యమైన వరకు పనులు చేసుకుంటున్నారు. బొత్స అండతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఇక ఇక్కడ టీడీపీని పతివాడ నారాయణస్వామి నడిపిస్తున్నారు. అయితే ఆయనకు వయసు మీద పడటంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆయన వారసులు పోటీ పడుతున్నారు. ఇలా వారసత్వ పోరు నడవటంతో టీడీపీ వీక్ అయిపోయింది. టీడీపీ వీక్ అవ్వడమే అప్పలనాయుడుకు ప్లస్ అయింది. కానీ ఇక్కడ టీడీపీ కేడర్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల, ఎప్పుడైనా పుంజుకునే అవకాశముంది.

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే...జగన్ వేవ్, బొత్స ఇమేజ్‌ వల్ల వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం ఖాయం. నియోజకవర్గంలో నెల్లిమర్ల, పూసపాటిరేగ,డెంకాడ, భోగాపురం మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లో వైసీపీకి బలం ఉంది. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మొత్తానికి చూసుకుంటే ప్రెజెంట్ ఇక్కడ అప్పలనాయుడు స్ట్రాంగ్‌గానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: