బిగ్ బాస్ సీజన్ 4 షో హోస్ట్ గా ఉన్న కింగ్ నాగార్జున ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇచ్చారు. శని, ఆదివారాలు వస్తే హౌజ్ మేట్స్ తో పాటు షో చూసే ఆడియన్స్ సైతం నాగ్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటిది నాగ్ ఉన్నట్టుండి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశారు. ఏకంగా హిమాలయాలకే వెళ్ళిపోయారు. సన్యాసం అయితే తీసుకోలేదు గాని చిన్న గ్యాప్ తీసుకున్నారని తెలుస్తుంది. ఆ గ్యాప్ దేనికి అంటే ఆయన నటించబోయే ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసమే. ప్రస్తుతం ఆయన హిమాలయా ప్రాంతంలోని రోహ్ తంగ్ పాస్ దగ్గర ఉన్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. “రోహ్ తంగ్ పాస్ దగ్గర సముద్రమట్టానికి 3980 మీటర్ల ఎత్తులో అంటే 13 వేల ఫీట్లు హైట్ లో ఉన్నాము. చాలా డేంజరస్ ప్లేస్. అందమైన పర్వతాలు, బ్లూ స్కై, వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. నవంబర్ నుంచి మే వరకూ ఈ పాస్ ను క్లోజ్ చేస్తారు. అందుకే షూటింగ్ కోసం వచ్చాము. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది, ఆ తర్వాత వచ్చేస్తాను. లవ్ యూ ఆల్” అంటూ అభిమానులకి వీడియో పోస్ట్ చేశారు. అయితే అభిమానులు ఖుషీగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ లో కనిపించరన్న అసంతృప్తితో ఉన్నారు. శని, ఆదివారాల్లో బాస్ వస్తారనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి అని బాధపడుతున్నారు. మరోపక్క ఐపీఎల్ మ్యాచుల కారణంగా బిగ్ బాస్ పరిస్థితి ఓ మాదిరిగా ఉంది. ఇలాంటి క్రమంలో నాగ్, బిగ్ బాస్ నుంచి వెళ్ళడంతో షోపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. కాగా రమ్యకృష్ణ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ శివగామి తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులని అలరిస్తారో లేదో చూడాలి.

ఇక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని ఆశిశోర్ సోల్మన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగ్, NIA (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) ఏజెంట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దియా మీర్జా, సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ ఫిబ్రవరి నెలలోనే అయిపోయింది. కరోనా కారణంగా షూటింగ్ క్యాన్సిల్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ పనులు స్టార్ట్ చేశారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏది ఏమైనా గాని మూడు వారాల పాటు నాగ్ బిగ్ బాస్ లో కనిపించరు. ఆ తర్వాతయినా బిగ్ బాస్ హోస్ట్ గా కంటిన్యూ చేస్తారో లేదో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: