పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో. లేకపోతే వందల కోట్లతో సినిమాలు తీస్తారు. హంగామా కూడా ఎక్కువగా ఉంటుంది. డబ్బా మంచినీళ్ళా అన్న లెక్కన ఖర్చు పెడతారు. అలాంటిది కొందరి దగ్గరకు వచ్చేసరికి మాత్రం డబ్బు ఇచ్చేందుకు చేతులు రావు అంటారు.

సినిమా పరిశ్రమను కరెన్సీ రివర్ అనేవారు. అంటే ప్రవహించే డబ్బుల నది అన్న మాట. ఇక్కడ ఎవరికి ఎంత ఓపిక ఉంటే ఎవరు  ఎక్కువ తెచ్చుకుంటే అంతా వారి సొత్తే. అయితే  ఇది గతంలో మాట. పాత రోజుల్లో అందరికీ ఒక పద్ధతిగా రెమ్యునరేషన్లు ఉండేవి. ఏమైనా తేడా వస్తే సాటి నటులు గట్టిగా నిలబడి న్యాయమైన మొత్తాలని ఇప్పించేవారు. నాడు అంతా ఒక్కటిగా ఉండేవారు. అలాంటిది ఇపుడు సినిమా నడక, నడత కూడా పూర్తిగా మారిపోయాయి.

టాలీవుడ్ లో కొందరిదే రాజ్యం. వారు అన్న మాటే వేదంలా చలామణీ అవుతోంది. దాంతో వారు కోరిన మొత్తాలను ఇచ్చి మరీ సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. అదే చిన్న వారు, అప్ కమింగ్ హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం గీచి గీచి బేరాలు ఆడుతున్నారు. అలాగే చిన్న టెక్నీషియన్లకు కూడా సరైన రెమ్యునరేషన్ దక్కడం లేదు అంటున్నారు.

గతంలో ఎలా ఉన్నా ఇపుడు కరోనా కారణం చూపించి తెగ్గోస్తోంది వీరికే అంటున్నారుట. అంతే కాదు, బడ్జెట్ కటింగ్ అన్న పేరు మీద అచ్చంగా బలి అవుతున్న‌ది కూడా వీరే అంటున్నారు. ఈ పరిణామాలతో సినీ పరిశ్రమలో చిన్న వారు ఇబ్బందులు పడుతున్నారు అన్న మాట అయితే ఉంది. బడ్జెట్ కటింగ్ అంటే అందరికీ ఒక రూల్ ఉండాలి కదా అన్నది  కూడా వినిపిస్తోంది. అలా కాకుండా కొందరిని మాత్రం వదిలేసి చిన్న  వారి విషయంలోనే ఇలా చేయడమేంటి అన్న చర్చ ఉంది. మొత్తానికి చిన్న వారి మీద పెద్ద బెత్తం దెబ్బలు పడుతున్నాయన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: