కేంద్ర మంత్రులు బన్సల్, అశ్వినీ కుమార్ ల రాజీనామాతో  రాష్ట్రంలో రాష్ట్ర మంత్రుల పై ఒత్తిడి పెరుగుతోంది. కాగా ఒకే పార్టీలోనే ఈ విధంగా ఉండడంతో స్వంత పార్టీనేతలే అవినీతి రాష్ట్ర మంత్రులపై విరుచుకు పడుతున్నారు. కేంద్రంలో తీవ్ర ఆరోపణలు, పార్లమెంట్ లో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజీనామా చేయక తప్ప లేదు. అప్పటికే ప్రధాని పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షాల గగ్గోలుతో కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఆందోళన చెందడంతో ఇందులో  ఇక ఏ మాత్రం జాప్యం చేయరాదని భావించి, వెంటనే వారితో రాజీనామా చేయించారు.

అక్కడి వరకు బాగానే ఉంది కానీ, రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల సంగతేంటని సొంత పార్టీ నేతలు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కళంకిత మంత్రులను కాపాడేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వారితో రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్ కు బలం చేకూరుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం విచారణ ఖైదీగా చంచల్ గూడా జైలులో ఉన్నారు. తర్వాత మంత్రులు ధర్మాన ప్రసాద్ రావు, పి. సబితాఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జె. గీతారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ అక్రమాస్తులు కూడ గట్టేందుకు మంత్రులు సహకరించారన్న అభియోగాలను వీరు ఎదుర్కొంటున్నారు. వైఎస్ హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి జగన్ కు సహకరించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు సాక్షాత్తు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పైనే చార్జీషీటు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా మంత్రి పదవికి ఆమె రాజీనామా చేసినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించలేదు. మంత్రులు కూడా ఆమె నివాసానికి వెళ్ళి రాజీనామా ఉపసంహరించుకోవాల్సిందిగా నచ్చజెప్పారు. దీంతో మంత్రుల విషయం తాత్కాలికంగా కొంత సద్దుమనిగినప్పటికిని కేంద్ర మంత్రుల రాజీనామతో మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఒక విధంగా, రాష్ట్రంలో మరోవిధంగా ఎందుకు ప్రవర్తిస్తుందనే విషయంలో విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంతో  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ వీరు రాజీనామ చేయక పోతే అధిష్టానం పట్టించుకునే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: