తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రాతినిధ్యం వ‌హించిన నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రైత‌న్నల ఆగ్ర‌హం అంశం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. క‌విత‌కు వ్య‌తిరేకంగా రైతులు నామినేష‌న్లు వేసిన సంగ‌తి తెలిసిందే. భారీ స్థాయిలో వేసిన నామినేష‌న్ల‌తో దేశంలోనే రికార్డు స్థాయిలో ఈవీఎంలు ఉప‌యోగించి ఇక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెర‌మీద‌కు వ‌చ్చిన మ‌రో సంచ‌ల‌నం ఇక్క‌డి రైతులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ బ‌రిలో ఉన్న వార‌ణాసిలో పోటీ చేయ‌డం. 


పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధరలు సాధించుకోవాలనే ఉద్దేశంతోనే తాము ప్రధానిపై పోటీ చేయడానికి సిద్దమైనట్లు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి నామినేషన్ వేసేందుకు ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన మొత్తం 45మంది రైతులు ప్రత్యేక బస్సులో నాగ్‌పూర్‌ వెళ్లారు. అక్కడ నుంచి రైలులోవారణాసికి చేరుకోనున్నారు.ఈ నెల 27,28 తేదీలలో ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తామని రైతులు తెలిపారు.  తాము స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తమకు సంఘీభావంగా తమిళనాడుకు చెందిన మరో 100మంది రైతులు వారణాసిలో నామినేషన్లు వేస్తారన్నారు.


అయితే, నిజామాబాద్ నుండి వార‌ణాసికి బ‌య‌లుదేరిన రైతుల ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. ఈ పోటీ ప‌ర్వంపై ప‌లువురు రైతుల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నుంచి వారణాసి వెళ్లిన 45 మంది రైతులు టీఆర్ఎస్ నేత‌ల‌ని ప‌లువురు పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనను అడ్డుకోవాలనే  ఉద్దేశ్యంతో టీఆర్ఎస్‌ పార్టీ  రైతుల ముసుగులో టీఆర్ఎస్‌ కార్యకర్తలను వారణాసికి పంపిందని ఆరోపిస్తున్నారు.టీఆర్ఎస్ సానుభూతి పరులు కాకపోతే నిజామాబాద్  పార్లమెంటు ఎన్నికల్లో కవిత మీద ఎందుకు నామినేషన్లు వేయలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ ఉద్యమనికి దూరంగా ఉండి, ఇప్పుడు వారణాసిలో పోటీ మ‌ర్మమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: