కాలం ఎంత మారినా ఇంకా మారాల్సిన బతుకులు చాలా ఉన్నాయి.. చంద్రయాన్ 2 కాలంలోనూ అనాగరిక ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన కళ్ల ముందే.. మన కాలంలోనూ ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. అలాంటి మూఢాచారాల్లో మాతంగి వ్యవస్థ ఒకటి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ దుర్మార్గం కొనసాగుతోంది.


ఆడపిల్లల్ని చిన్నప్పుడే దేవుడికిచ్చి పెళ్లి చేసే ఆచారాన్ని ‘మాతంగి’ అంటారు. అభం శుభం తెలియని వయసులోనే కొందరు తల్లిదండ్రులు, గ్రామపెద్దలు ఆడపిల్లలను గ్రామ దేవతకి అంకితమిస్తారు. అప్పటినుంచి ఆమె ఆరుబయలు జీవితంలో అందరి వస్తువైపోతుంది. దేవుడు, దెయ్యం పాపం పుణ్యం తెలియక పోయినా వూరోళ్ళు ఆడమంటే ఆడాలి.. తాగమంటే తాగాలి. ఊరి జాతరలు, కొలుపుల్లో తానే దేవునికి ప్రతిరూపం. అందరినీ ‘మాత’ అయ్యి దీవిస్తుంది. కానీ ఆమెని ఎవరూ అమ్మలాగా చూడరు.. అక్కలా, చెల్లిలా ఆదరించరు. హిందూ మతంలోని హిపోక్రసీకి ఈ వ్యవహారం నిలువెత్తు సాక్ష్యం.


సమాజం వారిని చిన్న చూపు చూస్తుంది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువుని చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయాలంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. విచిత్రం ఏంటంటే.. ఉత్సవాల్లో ఆమె కాళ్ళు మొక్కిన వాళ్ళే తర్వాత ఆమె గుడిసె తలుపు తడతారు. కొంచెపు మాటలతో ఆమెని తూట్లు పొడుస్తారు.


జాతరలో ఆమె చేత మొహాన ఉమ్మేయించుకుళ్ళే తర్వాత ఆమెని చీదరించుకుంటారు. ఆమె చేత బూతులు తిట్టించుకున్నోళ్ళే ఆమెని ‘లంజా’ ‘లమ్డీ’ అంటారు. దేవత కాస్తా జాతర, కొలుపులు అయ్యాక అలగా దెయ్యం అవుతుంది. ఇంతటి వైరుధ్యం ప్రపంచంలో మరెక్కడా చూడం. వీరి బతుకుల్లో మార్పు కోసం కొన్ని స్వచ్చంధ సంస్థలు పని చేస్తున్నా.. ఇంకా వీరి బతుకులు చాలా మారాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: