ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదల చేసిన "భారతదేశ అత్యంత అవినీతిపరుల" జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అధ్యక్షులు, అధ్యక్షురాళ్లు ఉండటం గమనార్హం. ఈ జాబితాలో ఉన్న అవినీతిపరుల పేర్లను పరిశీలిస్తే... కేంద్ర మంత్రుల జాబితాలో సుశీల్ కుమార్ షిండే, కపిల్ సిబల్, జీకే వాసన్, కమల్ నాథ్, వీరప్ప మొయిలీ, శరద్ పవార్, చిదంబరం (కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా (ఎన్.సి)లు ఉన్నారు.  అదేవిధంగా సురేశ్ కల్మాడీ (కాంగ్రెస్), నితిన్ గడ్కరీ (బీజేపీ), ములాయం సింగ్ యాదవ్ (ఎస్పీ చీఫ్), బీఎస్ యడ్యూరప్ప (బీజేపీ), అనంత్ కుమార్ (బీజేపీ), అనురాగ్ ఠాకూర్, ప్రపుల్ పటేల్ (ఎన్సీపీ), అళగిరి (డీఎంకే), కనిమొళి (డీఎంకే), ఏ రాజా (డీఎంకే), అస్సోం సీఎం తరుణ్ గొగోయ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ తదితరులు ఉన్నారు. వీరు పార్లమెంటులో అడుగుపెట్టకుండా వచ్చే ఎన్నికల్లో వీరిపై సమర్థులైన అభ్యర్థులను పోటీకి దింపుతామని కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించినట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: