నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గట్టి షాకిచ్చింది. ఆయనకు చెందిన రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మనీ లాండరింగ్ కేసులో ఈ మేరకు ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఫరూక్ కు చెందిన మూడు రెసిడెన్సియల్, ఒక కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డు, కాతిపురా తహశీల్ తన్మార్గ్, జమ్మూలోని బటింటి తదితర ప్రాంతాల్లో ఈ భవనాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీనగర్‌లో సంపన్న ప్రాంతమైన రెసిడెన్సీ రోడ్డులోని ఓ వాణిజ్య సముదాయాన్ని కూడా జప్తు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తుల బుక్ వాల్యూ రూ. 11.86 కోట్లు మాత్రమే అయినప్పటికీ... మార్కెట్ వాల్యూ మాత్రం రూ. 60 నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెపుతున్నారు.
 
జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి 2018లో ఫరూక్ అబ్దుల్లాపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. 2002 నుంచి 2011 మధ్య  కాలంలో రూ. 43.69 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ అబ్దుల్లాతో పాటు మరో ముగ్గురిపై ఛార్జిషీట్ వేసింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ఫరూఖ్‌ అబ్దుల్లా పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫరూక్‌ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్‌ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపించింది.  

 అయితే తన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై ఫరూక్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే తనపై ఈడీ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. తన ఆస్తులను అటాచ్ చేయడాన్ని కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: