
జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 20 జిల్లాల్లోని 280 డీడీసీ స్థానాలకు నవంబర్ 28, డిసెంబర్ 19 వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక్క జమ్మూలో తప్ప మిగతా ప్రాంతాల్లో బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది. శ్రీనగర్ డివిజన్‌లో మొత్తం 113 స్థానాలుండగా.. అందులో ఏకంగా 67 స్థానాల్లో పీఏజీడీ కూటమి గెలుచేందుకు అతి చేరువలో ఉంది. కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్‌కు 28, పీడీపీకు 25 స్థానాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
జమ్మూ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నా గుప్కార్ కూటమి కూడా తీవ్ర పోటీ ఇస్తోంది. మొత్తం 108 స్థానాల్లో బీజేపీ 53 స్థానాలతో ఆధిక్యంలో ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా కూటమి కూడా సమీప ఆధిక్యంలోనే ఉంది. అయితే శ్రీనగర్ డివిజన్‌లో మాత్రం కేవలం 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది. మిగతా స్థానాలన్నీ పీడీపీకే దక్కేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. అంతేకాదు
పంచాయతీ రాజ్ వ్యవస్థలో భాగంగా డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సెల్‌కు ఎన్నికలు జరగడం జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఈ ఎన్నికల్లో మొత్తం 57 లక్షల మంది జమ్మూ కాశ్మీర్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం 51 శాతంగా ఉంది.