ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరిగ్గా అయిదేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రధానంగా మూడు లక్ష్యాలను సాధించొచ్చని ఆయన నమ్మబలికారు. అందులో ఒకటి అవినీతిని అంతమొందించడం, రెండు పారదర్శకతను పెంచడం, మూడోది ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే కాకుండా నల్లధనాన్ని వెలికి తీయవచ్చన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలను సామాన్య ప్రజానీకం విశ్వసించింది. నల్లధనం తమ ఖాతాల్లో జమ అవుతుందని భావించింది. అయితే పెద్ద నోట్లు రద్దయి అయిదేళ్లు అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన లక్ష్యాలను సాధించలేదన్న అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2016 నవంబర్ 8వ తేదీన సమయం సాయంత్రం 7.30 గంటలకు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. పెద్ద నోట్లు అయిన రూ.500, రూ.1000 లను రద్దు చేసి... వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన రూ. 500 నోట్లు, రూ. 2000 నోట్లను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో నాడు దేశంలో చెలామణిలో ఉన్న  86 శాతం నగదు సర్క్యులేషన్‌ కాకుండా నిలిచిపోయింది. నోట్ల రద్దుతో కొన్ని మాసాల్లోనే బ్లాక్‌ మనీ బయటకు వస్తుందని, లెక్క చూపని డబ్బును రిజర్వు బ్యాంకు మళ్లీ ముద్రించి చెలామణిలోకి తీసుకువస్తుందని, తద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని మోదీకి వత్తాసు పలికే ఆర్థికవేత్తలు, నిపుణులు ముచ్చట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదరికం అంతం అవుతుందని, నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ కారణంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని కూడా తెలిపారు. చివరకు తేలింది ఏమిటంటే.. కేవలం 6 శాతం మాత్రమే నల్లధనం ఉందని, దీని కోసం 90 శాతం ఉన్న నగదును రద్దు చేయడం అన్నది తెలివి లేని నిర్ణయమని తేలిపోయింది.

నల్లధనంతో పాటు నకిలీ నోట్ల లెక్క కూడా తేలుతుందనుకుంటే అది కూడా ఆశనిపాతమే అయింది. ఎందుకంటే- చెలామణిలో ఉన్న నకిలీ కరెన్సీ అప్పట్లో ఉన్న నగదులో కేవలం 0.02 శాతం కంటే తక్కువేనని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. కాలక్రమంలో నోట్ల డిజైన్లలో మార్పులు చేస్తూ... నకిలీ నోట్ల బెడదను ఎదుర్కొనవచ్చన్న సూక్ష్మ సూత్రాన్ని వదిలేశారు. మొత్తంమీద కొండను తవ్వి ఎలుకను తవ్విన చందంగా నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: