ఏపీలో పొత్తుల మీద ప్రచారం అపుడే మొదలైపోయింది. పొత్తు పెట్టుకునే పార్టీల విషయం ఎలా ఉన్నా చాలా మంది దాని మీద మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికలకు టీడీపీ ఒక విధంగా అన్ని రకాలైన అస్త్రాలను నెమ్మదిగా సమకూర్చుకుంటోంది.

వచ్చే ఎన్నికలు టీడీపీకి ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా చెబుతున్నారు. ఈసారి కనుక గెలవకపోతే కచ్చితంగా టీడీపీకి ఇబ్బందే. ఒక విధంగా రాజకీయ  ఉనికి ప్రమాదంలో పడుతుంది. దాంతో ఈసారి ఎలాగైనా పొత్తులను పెట్టుకుని రావాలని టీడీపీ భావిస్తోంది. అదే విధంగా జనసేనతో పొత్తులకు టీడీపీ రెడీ అంటోంది.

ఈ సంగతిని విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. తమ సంగతేమో కానీ దిగువ స్థాయిలో క్యాడర్ మాత్రం రెండు పార్టీల మధ్య పొత్తుని కోరుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చూడాలన్నా, ప్రస్తుతం అరాచక ప్రభుత్వం పోవాలన్నా కూడా జనసేన టీడీపీ కలవాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.

రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పెద్ద సమస్య కాదని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి అయ్యన్న పాత్రుడు టీడీపీలో సీనియర్ నేత. పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. అందువల్ల కచ్చితంగా ఆయన ఈ మాటలు అంటున్నారు అంటే హై కమాండ్ ఆ దిశగా భారీగా కసరత్తు చేస్తోంది అనుకోవాలి. అయితే జనసేన ఈ రోజుకీ ఈ విషయం మీద పెదవి విప్పడంలేదు. అయితే ఆ పార్టీ టీడీపీని పల్లెత్తు మాట అనడంలేదు, కాబట్టి రెండు పార్టీల మధ్య పొత్తు అన్నది ఖాయమనే అనుకోవాలేమో. మరో వైపు చూస్తే ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉంది. మరి ఆ పార్టీ నేతలు అయితే ఈ రోజుకీ టీడీపీతో వైరాన్నే ప్రకటిస్తున్నారు. అయితే రాజకీయాల్లో  ఎపుడేమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి చూస్తూ ఉంటే 2014 నాటి పొత్తుల కాంబో 2024 ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుంది అన్న మాట అయితే ఉంది. చూడాలి మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: