పాలనాపరమైన అంశాల్లో సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలు కమిటీలుగానే మిగిలిపోయాయా..? కమిటీలు కేవలం రివ్యూలకే పరిమితమయ్యాయా? సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన  క్యాబినెట్ సబ్ కమిటీల పరిస్థితి ఏమిటి? పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ఏడు కేబినెట్ సబ్ కమిటీ లను ఏర్పాటు చేశారు. పోడు భూములు,ఉద్యోగుల సమస్యలు, ధరణి లో కొనుగోలు, అమ్మకాలు, వైద్య శాఖలో వసతుల ఏర్పాటు  ఇలా దాదాపు ఏడు కేబినెట్ సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి, వాటికి సంబంధిత మంత్రులను సభ్యులుగా నియమించారు. అయితే ఈ కమిటీలో తూతూ మంత్రంగానే భేటీలు నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరణి సమస్యల పరిష్కార కమిటీ మూడుసార్లు భేటీ అయిన సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరి వాదన.

 అంతేకాదు అటవీ భూములకు హక్కు పత్రాలు  కావాలని గతంలో లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. అయితే మిగతావి ఎందుకు తిరస్కరణకు గురయ్యాయన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కొత్త జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు,పిఎస్ లా అవసరాలను సమీక్షించేందుకోసం సబ్ కమిటీ ఏర్పాటయింది. అదేవిధంగా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 75 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఏంటని నిరుద్యోగులు వాపోతున్నారు.

ఇక అనాధాశ్రమాల స్థితిగతులు, సమస్య అవగాహన విధాన రూపకల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇళ్ల స్థలాల కు సంబంధించి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనుమతి లేని లే-అవుట్ లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠాలు, ఇతర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా అది పూర్తి స్థాయిలో నోచుకోలేదు. ఇలా ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ, కమిటీలు గానే మిగిలిపోయాయి తప్ప ఎలాంటి పురోగతి సాధించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: