ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలనేది కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యూపీ అసెంబ్లీలో 400 పైగా సీట్లు ఉన్నాయి. యూపీలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందనేది తొలి నుంచి ఉన్న గట్టినమ్మకం. ఈ నేపథ్యంలో... యూపీలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. అందుకోసం ఇప్పటికే దాదాపు రెండున్నర ఏళ్లుగా యూపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా. ఒక దశలో యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ప్రియాంక అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే యూపీలో గంగా యాత్ర, రథయాత్ర నిర్వహించిన ప్రియాంక... ఎన్నికల్లో మహిళా ఓటర్లే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 40 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామని ఇప్పటికే ప్రియాంక ప్రకటించారు. అలాగే మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో కూడా ప్రకటించారు. విద్యార్థులకు సైకిళ్లు, స్కూటీలు, లాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లతో పాటు ఉచిత ఇంటర్‌నెట్ అవకాశం కూడా కల్పిస్తామంటూ హామీలు ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రియాంక విడుదల చేశారు. అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండానే యూపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి కనీస సీట్లు దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ. అధికార బీజేపీతో సమాజ్ వాదీ పార్టీ నేతలకు కూడా షాక్ తగిలేలా తొలి జాబితాను ప్రకటించారు. 125 మంది అభ్యర్థులతో విడుదలైన తొలి జాబితాలో.... 40 శాతం సీట్లు మహిళలకు, మరో 40 శాతం యువతకు కేటాయించారు ప్రియాంక. అదే సమయంలో రాష్ట్రంలో సంచలనం రేపిన ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి ఆశాసింగ్‌కు కూడా ఫస్ట్ లిస్ట్ లోనే అవకాశం ఇచ్చేశారు. ఆశాసింగ్ ఉన్నావ్ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం మాత్రం ప్రియాంక గాంధీ వాద్రా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అంశం... అటు బీజేపీలో, ఇటు ఎస్‌పీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: