రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీలో భారీగానే టికెట్ల కోత ఉండబోతోందని పార్టీ వర్గాల సమాచారం. గడచిన రెండున్నరేళ్ళకు పైగా మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు క్షేత్రస్ధాయిలో సర్వేలు చేయించుకున్నారు. తనకు అందని ఫీడ్ బ్యాక్ ప్రకారం బాగా ఆరోపణలున్నవారు, జనాలతో సంబంధాలు లేకుండా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నవారు, పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా తిరుగుతున్నవారు అనే మూడు క్యాటగిరీలుగా సర్వే చేయించుకున్నారట.

సర్వేల్లో జగన్ కు అందిన రిపోర్టు ప్రకారం సుమారు 50 మందికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉందికాబట్టి జగన్ ఆశించినట్లుగా మంత్రులు, ఎంఎల్ఏలు తమ పనితీరును మార్చుకుని మెరుగుపరుచుకుంటే టికెట్లు దక్కే అవకాశాలున్నాయని సమాచారం.

రిపోర్టు ఆధారంగా డైరెక్టుగా చెప్పాల్సిన వారికే వార్నింగులు జగన్ పంపారట. అందుకనే వారి వైఖరిలో మార్పొస్తుందేమో అని జగన్ అనుకుంటున్నారు. తాను హెచ్చరించినా పనితరు మార్చుకోకపోతే టికెట్లపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి తన వైఖరిని మార్చుకునే అవకాశంలేదు. ఆనంను అసలు పార్టీలో చేర్చుకుని ఎంఎల్ఏ టికెట్ ఇచ్చిందే ఎక్కువ. అలాంటిది గెలవగానే మంత్రిపదవిపై ఆశపడ్డారు. అది దక్కకపోవటంతో అసంతృప్తవాదిగా మారిపోయారు. ప్రభుత్వంపై నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.

ఆనం లాంటి వాళ్ళు ఇంకా కొందరున్నట్లు జగన్ కు రిపోర్టులో వచ్చిందట. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఎంఎల్ఏ అన్నా రాంబాబు వ్యవహారం చాలాసార్లు వివాదాస్పదమైంది. అలాగే మరో ఎంఎల్ఏ మధుసూధనగుప్తా కూడా వివాదాల్లో ఉన్నారు. పైగా ఈయన జనాలకే కాదు  క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండరట. ఇలాంటి ఎంఎల్ఏల జాతకాలంతా జగన్ చేతిలో ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా సుమారు 50 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీ నేతలంటున్నారు. ఆరోపణలున్నవారిని, వివాదాస్పదమైన వారిని మారిస్తేనే మంచిదని పార్టీ క్యాడర్ కూడా అంటోంది. మరి జగన్ చివరకు ఏమి చేస్తారో చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి: