మూడేళ్ల పాటు అల్లకల్లోలం సృష్టించిన కరోనా ఈ మధ్యే దేశంలో కాస్త శాంతించింది. అంతా సాధారణ జీవితానికి మళ్ళీ అలవాటు పడ్డారు. ఏదో నామ మాత్రానికే కొన్ని చోట్ల మాస్క్ లు వాడుతున్నారు. కానీ కరోనా భయం అయితే తగ్గిందనే చెప్పాలి. అయితే చైనా, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఇప్పటికీ నిత్యం పాజిటివ్ కేసులు వేలల్లో నమోదు అవుతూ భయపెడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వైరస్ భయాన్ని వీడి ప్రశాంతంగా ఉన్న మన దేశంలో మళ్ళీ కరోనా కలకలం మొదలయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో పిల్లలపై కరోనా ప్రభావం ఆందోళనకు గురి చేస్తోంది. ఏకంగా 14 మంది చిన్నారులు కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు అంటే చిన్న విషయమేమీ కాదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఢిల్లీలో కొవిడ్‌తో 53 మంది ఆసుపత్రి పాలవగా అందులో 14 మంది పిల్లలు ఉండటం గమనార్హం. ఇంకా చాలా మంది పిల్లలకు కరోనా లక్షణాలు ఉన్నాయి అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఇపుడు ఒక్క సారిగా ఇంతమంది చిన్నారులు వైరస్ కారణంగా హాస్పిటల్లో చేరారు అంటే సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.   ఆసుపత్రిలో కరోనాతో చేరిన వారిలో ఎక్కువ మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. శనివారం రోజు ఉదయం 14 మంది పిల్లలు కరోనాతో హాస్పిటల్ లో చేరారని వైద్యులు చెబుతున్నారు.

అయితే వైరస్ ప్రభావం వారిపై ఏ స్థాయిలో ఉంది అన్న వివరాలు ఇంకా బయటకు తెలియలేదు. దీంతో  ఇదేమైనా మళ్ళీ మ్యుటేషన్ చెందిందా ? ఇది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపనుందా అన్న కోణంలో వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు దీని గురించి ఒక నిర్ధారణకు రాలేమని అంటున్నారు.  అయితే ఈ వార్తతో దేశంలో  మళ్ళీ కరోనా భయం మొదలయ్యింది. మళ్ళీ ఎక్కడ ఇది తిరగ పడుతుందా అని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు పిల్లలకు ఇది ఎక్కడ సోకుతుందో అని కలవరపడుతున్నారు. మరి వీటికి సమాధానం కొరకు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  ఈ పరిస్థితిపై ఢిల్లీ ప్రభుత్వం అధ్యయనం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: