పంజాబ్‌ లోని మొహాలీలో ఇంటెలిజెన్స్‌ విభాగం హెడ్ క్వార్టర్స్ పై జరిగిన రాకెట్ లాంచర్ దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇది ఉగ్రమూకల పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన తర్వాత పంజాబ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ హై ఎలర్ట్ ప్రకటించి ఆ ఘటనపై విచారణ చేపట్టారు. ఇంటెలిజెన్స్ కార్యాలయంలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలిస్తున్నారు.

మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్‌–ప్రొపెల్డ్‌ గ్రెనేడ్‌ విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఆర్పీజీ వల్ల పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇంటెలిజెన్స్ ఆపీస్ లోని కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ఇది ఉగ్రవాద దాడి కాదని అంటున్నా రాకెట్ లాంఛర్ వాడారు కాబట్టి అంత తేలిగ్గా కొట్టి పారేయలేమనే వాదన కూడా వినిపిస్తోంది.

సెక్టార్‌ 77, SAS నగర్‌ లో పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. చుట్టుపక్కల ప్రాంతాల వారు బిత్తరపోయారు. కాసేపటికే బాంబు దాడి అనే ప్రచారం మొదలైంది. దీంతో పంజాబ్ లో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం మాత్రమే ఊరటనిచ్చే అంశం. సీనియర్‌ అధికారులు దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఫోరెన్సిక్‌ బృందాలను సైతం పిలిపించి విచారణ చేస్తున్నారు. ఇటీవలే పంజాబ్‌ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జరిగిన పేలుడు ఘటనకు, ఉగ్రవాదుల అరెస్ట్ కి ఏమైనా సంబంధం ఉందో లేదో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: