తెలుగుదేశంపార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో పొత్తుల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఎన్నికల ముందు మాత్రమే పొత్తులపై చర్చించాలని. దాదాపు రెండేళ్ళ క్రిందటే పొత్తు పెట్టుకోవాలని ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చంద్రబాబునాయుడు లవ్ లెటర్ రాసిన విషయం తెలిసిందే. తానుపంపిన లవ్ ప్రపొజల్ కు పవన్ ఎలాంటి సమాధానం చెప్పలేదని స్వయంగా చంద్రబాబే కుప్పంలో చెప్పారు.

ఆ తర్వాతెప్పుడో టీడీపీతో పొత్తుకు రెడీ అని పవన్ ఓపెన్ ఆఫర్ ఇస్తే టీడీపీ స్పందించలేదు. ఇలాగే ఇద్దరి మధ్య మ్యూజికల్ ఛైర్ గేమ్ జరుగుతోంది.  ఆమధ్య పవన్ మాట్లాడుతు ఎన్నికల ముందు మాత్రమే పొత్తుల గురించి ఆలోచిస్తానని చెప్పారు. తాజాగా పాలిట్ బ్యూరో కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. రెండుపార్టీలు పొత్తులపై ఒకే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే ఇద్దరు భయపడుతున్నారట.

పొత్తులంటే అందరు ముందుచూసేది సీట్ల సంఖ్య, స్ధానాలు ఏవేవి అనే కదా. వీలైనన్ని సీట్లు ఎక్కువ తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో వీలైనన్ని తక్కువ సీట్లతో సరిపెడదామని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ ఇద్దరి ఆలోచనలకు లింకు కుదరటంలేదట. తక్కువ సీట్లకు ఒప్పుకుంటే కాపు సామాజికవర్గ నేతలు ఒప్పుకోరు. ఎక్కువ సీట్లు ఇవ్వటానికి సీనియర్ తమ్ముళ్ళు అంగీకరించరు.

పై రెండింటిలో ఏది జరిగినా వెంటనే దాని ఫలితాలను ఎదుర్కోవటం ఇద్దరి వల్లాకాదు. అటు కాపులు పవన్ పైన మండిపోవటం ఖాయం. ఇటు తమ్ముళ్ళు చంద్రబాబుపైన తిరగబడటం తప్పదు. తమ్ముళ్ళను ఎదుర్కోనేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. జనసేనలో పవన్ను ఎదిరించే వాళ్ళు లేరు కానీ కాపు సామాజికవర్గం నుండి సమస్యలు వస్తాయి. ఇలా రెండువైపులా సమస్యలు వస్తే అందరు కలిసి ఇద్దరు అధినేతలను ముంచేయటం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించే ఇద్దరు కూడా పొత్తులపై ఇపుడు నిర్ణయం తీసుకోవటానికి భయపడుతున్నారట. ఎప్పటికైనా నిర్ణయం తీసుకుని తీరాల్సిందే కదా ? అంటే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చని సర్దిచెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: